వడ్లు తడుస్తున్నా లారీలొస్తలేవ్.. కాంటా పెట్టి మిల్లులకు పంపాలని రైతుల ధర్నా

వడ్లు తడుస్తున్నా లారీలొస్తలేవ్.. కాంటా పెట్టి మిల్లులకు పంపాలని రైతుల ధర్నా

నెట్‌వర్క్‌, వెలుగు :  అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడిసిపోతున్నా.. మిల్లులకు తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని రైతులు మండిపడ్డారు. మంగళవారం అందోలు సోసైటీ, జోగిపేటలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు.  ధాన్యం తగులబెట్టి నిరసన తెలిపారు.  పోసానిపేటకు చెందిన రైతులు రెండు లారీలను అడ్డుకొని  గ్రామానికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో డ్రైవర్‌‌తో వాగ్వాదం జరగగా తహసీల్దార్ కలుగజేసుకొని కిరాయిని తాము చెల్లిస్తామని చెప్పి పంపించారు. 

ఆరు రోజుల నుంచి లారీలు ఖాళీ కావడం లేదని మెదక్ జిల్లా శివ్వంపేటలోని శ్రీసాయి వెంకటరమణ  రైస్ మిల్లు ముందు ఐదు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. తూప్రాన్--–నర్సాపూర్ రోడ్డుపై ట్రాక్టర్​లు అడ్డుగా పెట్టి గంటసేపు రాస్తారోకో చేశారు.  ట్రాన్స్​పోర్ట్​లారీలను ఆపి వడ్లను తీసుకెళ్లాలని కోరగా.. తమ ఓనర్లు తిడుతున్నారని వాళ్లు సమాధానం ఇచ్చారు.  ఇదే మండలంలోని మగ్దుంపూర్‌‌ రైతులు సంచుల్లో మొలకలు వస్తున్నా కాంటా పెట్టడం లేదని తూప్రాన్-–నర్సాపూర్ రోడ్డు మీద వడ్లు పోసి నిరసన తెలిపారు.  

లారీల కొరత తీర్చాలని నర్సాపూర్‌‌, జగదేవపూర్ మండలం మునిగడప, చేగుంట మండలం వడ్యారంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.  25 రోజులైనా వడ్లు కొనడం లేదని గుమ్మడిదల పరిధిలోని రైతులు మండల కేంద్రంలో టోల్​ గేట్​ వద్ద నిరసన తెలిపారు.  వడ్యారంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రావణ్​ కుమార్​ రెడ్డి, గుమ్మడిదలలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు నర్సింగ్​ రావు, దోమడుగు ఎంపీటీసీ గోవర్ధన్​ గౌడ్ రైతులకు మద్దతిచ్చారు. వారు మాట్లాడుతూ ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు సమకూర్చకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.