ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట, వెలుగు :  ఎల్కతుర్తి- నుంచి మెదక్, జనగామ నుంచి -సిరిసిల్లా నేషనల్ హైవే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో  నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హన్మకొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల మీదుగా 137.6 కిలో మీటర్ల మేర సాగే  ఎల్కతుర్తి మెదక్ హైవే నిర్మాణాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించామని,  జనగామ జిల్లా నుంచి చేర్యాల, సిద్దిపేట మీదుగా సిరిసిల్లా వరకూ సుమారు 105 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేపై నిర్మించనున్నట్టు తెలిపారు. హై వే నిర్మాణ పనుల విషయంలో  ఆర్అండ్ బీ, ఫారెస్ట్, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, రెవెన్యూ, రైల్వే శాఖల సమన్వయంతో పని చేయాలని సూచించారు. భూసేకరణ, ఇరిగేషన్ కాల్వలు, ఎలక్ట్రికల్ సంబంధించి ఎస్టిమేట్లు, పర్మిషన్లు తొందరగా చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో రెండు పెద్ద ప్రాజెక్ట్  నిర్మాణాల్లో  డిజైన్లలో లోపాలు ఉంటే సరిచూసుకోవాలన్నారు. సమావేశంలో  అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, నేషనల్ హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీలో ప్రొటోకాల్ లొల్లి

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్గీయుల మధ్య ప్రొటోకాల్ చిచ్చు రగిలింది. సంగారెడ్డి జిల్లా హత్నూరలో శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తనను స్టేజిపైకి పిలవకుండా ప్రొ టోకాల్‌‌‌‌‌‌‌‌ ఉల్లంగించారని టీఆర్ఎస్ కు చెందిన  స్థానిక సర్పంచ్ వీరస్వామిగౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్యెల్యే ముందే తనకు అవమానం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలలో సర్పంచులకు విలువ లేకుండా చేస్తున్నారన్నారు. ఈ విషయంలో స్థానిక జడ్పీటీసీ ఆంజనేయులు కలగజేసుకోగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేకల్పించుకుని ఇరువురికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల పేపర్లను అందజేశారు. 

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి 

మెదక్​ టౌన్, వెలుగు :  ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్​లో నిర్వహించిన ఎస్టీయూ టీఎస్​ వజ్రోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవో 317 ద్వారా స్థానికత కోల్పోయిన టీచర్లకు న్యాయం చేస్తామన్నారు. ఎస్టీయూ టీఎస్​ 75 ఏళ్లుగా విద్యా వ్యవస్థకు, ఉపాధ్యాయులకు సేవలు అందిస్తుండటం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ టీఎస్​ రాష్ట్ర ప్రెసిడెంట్​సందానందంగౌడ్​ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. సమావేశంలో ఎస్టీయూ టీఎస్​ రాష్ట్ర జనరల్​ సెక్రటరీ పర్వతరెడ్డి, మెదక్​ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు భుజంగరావు గారు, జిల్లా ప్రెసిడెంట్​ మెంగర్తి ప్రణీద్ కుమార్, జిల్లా జనరల్​ సెక్రటరీ  రాజగోపాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. 

చెక్కుల పంపిణీ 

మెదక్​లోని ఎమ్మెల్యే  క్యాంప్ ఆఫీసులో పాపన్నపేట మండలానికి చెందిన 42 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి అందజేశారు.  కార్యక్రమంలో మెదక్ జిల్లా రైతు బంధు ప్రెసిడెంట్​సోములు, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, తహశీల్దార్​ మహేందర్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : మండల పరిధిలో ఆయా గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనుల కు సంబంధించి పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సర్పంచులు అధికారులను కోరారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ లో ఎంపీపీ గన్నమనేని శ్రీదేవి చందర్ రావు అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.  సర్పంచ్ లు, ఎంపీటీసీ లు పలు సమస్యలను లేవనెత్తారు. రాంపూర్ గ్రామంలో పాఠశాల ఆవరణలో అంగన్​వాడీ భవనం నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని సర్పంచ్ భిక్షపతి విద్యాశాఖ అధికారులను కోరారు. గ్రామాలలో సీసీ రోడ్ల రిపేర్లను స్పీడప్​ చేయాలని జడ్పీటీసీ శ్రీహరి గౌడ్ ఆర్​డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఇర్కోడ్, బుస్సాపూర్, వెంకటాపూర్ గ్రామాలలో కూరగాయల సాగు అధికంగా ఉన్నందున ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ సదాశివ రెడ్డి కోరారు.  రాఘవపూర్, తోర్నాల గ్రామాలలో ఖాళీగా ఉన్న అంగన్​వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని వైస్ ఎంపీపీ శేరుపల్లి యాదగిరి సమావేశం దృష్టికి తెచ్చారు. అనంతరం ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సర్పంచులకు సూచించారు. సమావేశంలో ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస రావు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్​మెంట్​​ విడుదల చేయాలి

మెదక్​ టౌన్/సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న 3816 కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్​ నిధులను  వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మెదక్​లో ఏబీవీపీ జిల్లా కన్వీనర్​ శశికాంత్, సిద్దిపేటలో నగర జోనల్ ఇన్​చార్జి వివేక్  మాట్లాడారు. ఎనిమిదేండ్ల నుంచి విద్యార్థులకు స్కాలర్​షిప్పులు, ఫీజు రీయింబర్స్​మెంట్స్​ సరిగా రావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే తన ధోరణి మార్చుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

రాష్ట్రంలో అన్ని వర్గాలు బీజేపీ వైపే ఉన్నయ్

నారాయణ్ ఖేడ్, వెలుగు: తెలంగాణలోని అన్ని వర్గాలు బీజేపీ వైపే ఉన్నాయని ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ పార్లమెంట్ ఇన్​చార్జి బద్ధం మైపాల్ రెడ్డి, తెలంగాణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆలే భాస్కర్ అన్నారు. శుక్రవారం ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా పెద్ద శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.  జెండాలను ఆవిష్కరించి మాట్లాడుతూ రాష్ట్రంలో యువతతోనే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి, మెదక్​ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విజయ పాల్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, పార్లమెంట్ ఇన్​చార్జి రవికుమార్ గౌడ్, శంకరంపేట పట్టణ అధ్యక్షుడు కోణం విట్టల్ పాల్గొన్నారు.