ఆర్థిక కష్టాలు.. మద్యం అమ్ముతున్న కరాటే చాంపియన్

ఆర్థిక కష్టాలు.. మద్యం అమ్ముతున్న కరాటే చాంపియన్

రాంచీ: దేశానికి కీర్తి అందించిన ఎందరో క్రీడాకారులు ఉద్యోగం లేక, ఉపాధి దొరక్క పేదరికంలో మగ్గిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ మట్టిలో మాణిక్యమే జార్ఖండ్‌‌కు చెందిన బిమ్లా ముండా అనే యువ క్రీడాకారిణి. నేషనల్ కరాటే చాంపియన్ అయిన బిమ్లా.. 34వ నేషనల్ గేమ్స్‌‌లో సిల్వర్ మెడల్ గెలిచింది. 2014లో నిర్వహించిన అక్షయ్ కుమార్ ఇంటర్నేషనల్ చాంపియన్‌‌షిప్‌‌లో రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గింది. దీంతోపాటు దేశానికి, రాష్ట్రానికి ఎన్నో మరపురాని విజయాలు, పతకాలను అందించింది. ఇప్పుడు ఆమె దీనస్థితిలో ఉంది.

ఎన్ని పతకాలు సాధించినా బిమ్లాకు సర్కార్ ఉద్యోగం దొరకలేదు. ఆమె తల్లి దినసరి కూలీ. కరాటే లాంటి ఆటల్లో ముందుకెళ్లడానికి ఆర్థిక ప్రోత్సాహం, చేయూత అవసరం. బిమ్లాకు అవసరమైన చేయూతను అందించేవారు కరువయ్యారు. ఆమె తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వారి ఇల్లు గడవడం కష్టమైంది. దీంతో హండియాగా పిలిచే రైస్ బీర్‌‌ను అమ్ముతూ బిమ్లా తన కుటుంబాన్ని పోషిస్తోంది. అద్భుతమైన ప్రతిభ ఉన్నా ఆదుకునే వాళ్లు లేకపోవడంతో బిమ్లా గేమ్‌‌ను కంటిన్యూ చేయలేకపోతోంది. నేషనల్ చాంపియన్ అయి ఉండి కూడా కుటుంబ పోషణ కోసం ఆమె లిక్కర్‌‌ అమ్ముతుండటంపై చాలా మంది బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ లోకల్ జర్నలిస్ట్ ద్వారా బిమ్లా గురించి తెలుసుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆమెను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. బిమ్లాకు కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలను కల్పించాలని డిప్యూటీ కమిషనర్‌‌ను సోరెన్ ఆదేశించారు.