
హైదరాబాద్, వెలుగు : దాదాపు 20 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర సంఘం లైఫ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
దాదాపు 20 రాష్ట్రాల నుంచి 4వేల మంది క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్‌లో పోటీ పడుతారని చెప్పారు. 30 ప్లస్ నుంచి 70 ప్లస్ ఏజ్ కేటగిరీలో లాంగ్‌జంప్, హైజంప్, డిస్క్ త్రో, జావెలిన్ త్రో, స్ర్పింట్, హార్డిల్స్, లాంగ్ డిస్టెన్స్ రన్ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ మెగా ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ సెక్రటరీ ప్రభుకుమార్, ట్రెజరర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.