ఆప్​కు జాతీయ హోదా.. ఈసీ అధికారిక ప్రకటనే లాంఛనం

ఆప్​కు జాతీయ హోదా.. ఈసీ అధికారిక ప్రకటనే లాంఛనం
  • నెక్ట్స్ టైమ్ గుజరాత్​లో తప్పక గెలుస్తమని ధీమా

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)​ జాతీయ హోదాను సాధించింది. గుజరాత్​అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్లు, ఓట్ల షేర్​తో అందుకు అవసరమైన అర్హతలన్నీ ఆ పార్టీకి లభించాయి. ఒక పార్టీకి జాతీయ హోదా రావాలంటే మూడు రాష్ట్రాల నుంచి 11 లోక్‌‌సభ స్థానాలు ( ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక సీటు) గెల్చుకోవాలి. లేదా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండు చొప్పున సీట్లు, 6 శాతం ఓట్ షేర్ సాధించాలి.

లేదంటే నాలుగు, అంతకు మించి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. ఈ మూడింట్లో ఏది సాధించినా జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం(ఈసీ) గుర్తిస్తుంది. అయితే ఆప్​ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌‌లో మెజార్టీ సీట్లు గెలుచుకొని అధికారంలో ఉంది. ఈ ఫిబ్రవరిలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికలలో రెండు సీట్లు గెలుచుకోవడంతోపాటు 6.7 శాతం ఓట్లను సాధించింది. 

ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఫలితాల్లో 5 స్థానాలు గెలుచుకోవడంతోపాటు 12.9 శాతం ఓట్ షేర్ సాధించింది. ఈ లెక్కన జాతీయ పార్టీ హోదా పొందడానికి అవసరమైన అర్హతలు ఆప్​సాధించింది. ఇక ఎన్నికల సంఘం ప్రకటించడమే మిగిలి ఉంది.

గుజరాత్​ ప్రజలకు థ్యాంక్స్: కేజ్రీవాల్

ఆప్ జాతీయ హోదాను సాధించడంలో సహకరించిన గుజరాత్ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ థ్యాంక్స్​ చెప్పారు. ఈ ఫలితాలు నెక్ట్స్​టైమ్​అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలవగలమనే నమ్మకాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ‘‘దేశంలో అతి తక్కువ రాజకీయ పార్టీలు మాత్రమే జాతీయ హోదాను కలిగి ఉన్నాయి. కేవలం పదేండ్ల వయస్సు ఉన్న ఆప్ ఇప్పుడు ఆ లిస్ట్​లో చేరింది’’ అని కేజ్రీవాల్ గురువారం విడుదల చేసిన ఓ వీడియో మెసేజ్​లో అన్నారు.

గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిసారి అక్కడి ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, వారి ప్రేమ మరిచిపోలేనని చెప్పారు. ప్రచార సమయంలో, తమ పార్టీ నాయకులు ఎప్పుడూ ఎవరిపై బురదజల్లలేదని, అసభ్యకరమైన మాటలు మాట్లాడలేదని అన్నారు. ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లలో అమలు చేసిన స్కీంలు, సంక్షేమ పథకాలు, పాజిటివ్​ అంశాల గురించి మాత్రమే వారు ప్రజలకు వివరించారని తెలిపారు. ప్రజలకు నైణ్యమైన విద్య, వైద్యం అందించడమే ఎజెండాగా ముందుకు సాగుతున్న పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపు లభించిందని, దేశ ప్రజలందరికి కృతజ్ఞతలు అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.