దళితుల భూములపై దొరల పెత్తనమా

దళితుల భూములపై దొరల పెత్తనమా

వికారాబాద్ జిల్లా, వెలుగు: దళితులు సాగుచేసుకుంటున్న భూములపై దొరలకు హక్కు ఎక్కడిదని… వారిని వేధింపులకు గురిచేసే అధికారం ఎవరిచ్చారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్‌‌‌‌ రాములు అధికారులపై మండిపడ్డారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్‌‌‌‌లో జరిగిన రివ్యూ మీటింగ్‌‌‌‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో దళితులపై వేధింపులు పెరిగాయన్నారు. కొడంగల్‌‌‌‌కు చెందిన దొర సోమనాథ్ రెడ్డి దగ్గర హైదరాబాద్‌‌‌‌కు చెందిన బంగి లక్ష్మణ్, జయలక్ష్మి, బి.ఏ.స్వామి దాదాపు 98.12 ఎకరాల భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటుంటే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి అనుచరవర్గం బెదిరింపులకు పాల్పడి భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కొడంగల్‌‌‌‌లో పర్యటించి దళితులపై జరుగుతున్న దాడులుపై అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌‌‌‌లో దళితులపై దాడులకు సంబంధించి వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను నివేదిక అడిగినా ఇప్పటివరకు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌‌‌‌కు పంపలేదన్నారు. అధికార యంత్రాంగం దొరలకు అనుకూలంగా పనిచేస్తోందని పోలీసులు, రెవెన్యూ అధికారులు దళితులకు సహకరించడం లేదన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ మాట్లాడుతూ ఆ భూముల వివాదం కోర్టు పరిధిలో ఉన్న కారణంగానే తాము జోక్యం చేసుకోలేదని వివరణ ఇచ్చారు.