కార్పొరేట్లకు ఊడిగం చేసేలా నూతన లేబర్ కోడ్స్

కార్పొరేట్లకు ఊడిగం చేసేలా  నూతన లేబర్ కోడ్స్

భారతదేశ కార్మికవర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి.. వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్​ను ఈ నెల 21 నుంచి మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చినది.  గతంలో కార్మికవర్గానికి రక్షణగా ఉన్న 29 చట్టాలు నేటి నాలుగు కార్మిక స్మృతులు(కోడ్స్)తో  కాలగర్భంలో కలిసిపోయాయి. నూతన కోడ్స్​తో  సంఘటిత, అసంఘటిత కార్మికులకు  శ్రేయస్సు, సంక్షేమం, భద్రత చేకూర్చకపోగా ఆచరణలో అవి వారి పాలిట సంకెళ్లు అవుతాయి.  సంపద సృష్టికర్తలైన శ్రామికులను పెట్టుబడికి బానిసలుగా  మార్చుతాయి.  ఆశ్రిత  పెట్టుబడిదారులకు లాభాలు కురిపించటమే ప్రభుత్వ లక్ష్యం.  వ్యాపారాలు సులభతరం చేయడం ఈ కోడ్స్ ధ్యేయంగా ప్రభుత్వం  చెప్పింది. అంటే  పాత చట్టాలలో  కార్మికులకు రక్షణగా ఉన్నవాటిని తొలగించడాన్ని కార్మికుల హక్కులు హరించడమేనని ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది.  ఐదేళ్లుగా ఈ చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వం అప్పటి నుంచి కార్మికుల ఆగ్రహ జ్వాలలకు భయపడి వెనుకడుగు వేసింది. కానీ,  బిహార్​లో  ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ రావడంతో కేంద్రంలో కార్పొరేట్ అనుకూల విధానాల అమలు వేగవంతమైంది.

వేతనాల కోడ్ (2019),  పారిశ్రామిక  సంబంధాల కోడ్ (2020),  సామాజిక భద్రత కోడ్ (2020),  వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ (2020)లు అమలులోకి  వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవి మోదీ  ప్రభుత్వం 2020లోనే  పార్లమెంట్లో ఏకపక్షంగా ఆమోదించిన కార్మిక చట్టాలకు చెందిన నాలుగు లేబర్ కోడ్లు.  నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేట్ పెట్టుబడిదారులు కార్మిక చట్టాలలో మార్పులు తీసుకురావాలని  తీవ్రంగా ఒత్తిడి చేశారు.  ఆ నేపథ్యంలోనే  మోదీ  ప్రభుత్వం వారికి అనుకూలంగా కార్మికచట్టాల్లో మార్పులు తీసుకురావడానికి పూనుకొన్నారు. 2020లోనే పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే ప్రతిపక్షాలు సమావేశాలు బాయ్​కాట్ చేసిన నేపథ్యంలోనే  బిల్లులు ఆమోదం పొందాయి.

కార్పొరేట్ల కోసమే..

కార్పొరేట్ సంస్థలకు చౌకగా శ్రమశక్తిని అందించడం,  వారు మరిన్ని ఆర్థిక లాభాలను గడించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్​అమల్లోనికి తెచ్చిందని జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ కోడ్స్​అమలువల్ల  కార్మికుల పనిగంటలు పెరుగుతాయి.  అలాగే  లేబర్ కోడ్​లో 'వేతనాలు' అనే పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు.  బోనస్, ఇంటి  అద్దె అలవెన్స్,  రవాణా భత్యం,  కమిషన్ మొదలైన ప్రయోజనాలను వేతనాల నిర్వచనం నుంచి మినహాయించారు.  మొత్తం వేతనంలో ఈ మినహాయింపులు 50 శాతం దాటరాదని షరతులు విధించారు. గ్రాట్యూటీ, రిట్రెంచ్ మెంట్ పరిహారాన్ని దీనిలో చేర్చలేదు.  నిర్దిష్ట కాలానికి నియమించిన ఉద్యోగులకే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. శాశ్వత ఉద్యోగులకు గతంలో మాదిరి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటేనే గ్రాట్యుటీ లభిస్తుంది. 
కాంట్రాక్ట్,  ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులను   గ్రాట్యూటీ నుంచి మినహాయించారు.  సంపద పంపిణీ  చేయకుండా ఆర్థికవృద్ధిపై దృష్టి సారిస్తే  
నిరుద్యోగం పెరుగుతుందనే వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోనికి  తీసుకోలేదు.

 ఔట్​సోర్సింగ్​ విధానానికి ప్రోత్సాహం 

ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్​మెంట్ నిబంధనలతో తక్కువ కాల వ్యవధికి కార్మికులను నియమించడం సులభమవుతుంది.  పింఛను,  గ్రాట్యూటీ, ప్రమోషన్ అవకాశాలు లభించవు.  కార్మికులు ఎప్పటికీ ఔట్​సోర్సింగ్ లోనే ఉండిపోతారు. అసంఘటిత రంగ కార్మికులకు (గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు మొదలైనవారు) ఇచ్చే భద్రతా పథకాలకు నిధుల మూలాలు, అమలు ప్రణాళికలపై స్పష్టత లేదు. ఫలితంగా కార్మికులు అనేక ఆర్థిక ప్రయోజనాలు 
కోల్పోవాల్సి వస్తుంది.     కార్మికులకు  లభిస్తున్న రక్షణ హక్కులు కేంద్రం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్స్​తో  హరించుకుపోతాయి.  ఉద్యోగ భద్రత కరువవుతుంది.  

కార్మికులు  సమ్మె చేయాలంటే  60 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి.  మహిళలు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల నిర్దిష్ట అవసరాలను పట్టించుకునే క్లాజులు ఏవీ లేబర్ కోడ్స్​లో  లేవు.  చిన్న చిన్న సంస్థలలో  పనిచేసేవారికి సంబంధించి  ప్రత్యేకంగా ఎలాంటి రక్షణ చర్యల్ని సిఫార్సు చేయలేదు.  పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్షత, అసమానతలను నివారించేందుకు లేబర్ కోడ్స్​లో ఎలాంటి చర్యలు లేవు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు  ప్రసూతి ప్రయోజనాలు అందే పరిస్థితులు లేవు. ఇ- రిజిస్ట్రేషన్, ఆధార్​తో ముడిపడిన ప్రయోజనాలు డిజిటల్ పరిజ్ఞానం లేని కార్మికులకు ప్రతిబంధకంగా మారతాయి.

లేబర్ కోడ్స్​ను విరమించుకోవాలని నిరసనలు

ప్రస్తుతం అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో  లేబర్ కోడ్స్​అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న రోజునుంచే.. అంటే వేతన కోడ్ 2019లో ఆమోదించినప్పటి నుంచే కార్మిక సంఘాలు  దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.  2020 జనవరిలో స్వార్వత్రిక సమ్మెను నిర్వహించాయి. 2020 నవంబర్ 26న చారిత్రాత్మకంగా దేశవ్యాప్త సమ్మె జరిపాయి. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఏడాది జులై 9న సార్వత్రిక సమ్మె జరిగింది.  ఇందులో 25 కోట్ల మందికి పైగా కార్మికులు భాగస్వాములై సమ్మెను విజయవంతం చేశారు.  కార్మికసంఘాలు ఎన్ని అభ్యర్థనలు చేసినా, నిరసనలు వ్యక్తం చేసినా, సార్వత్రిక సమ్మెలు నిర్వహించినా పట్టించుకోని  కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్​ను  అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.  కార్మిక లోకంపై జరిగిన ఈ దాడిని సంఘటితంగా ఎదుర్కొంటాం.  ప్రభుత్వ చర్య కార్మికుల బానిసత్వంలోకి నెట్టడానికి, వారి హక్కులను లాగేసుకోవడానికి ఉద్దేశించినది.  కార్మిక కోడ్స్​ అమలైన పక్షంలో రాబోయే తరాల ఆశలు, నమ్మకాలు, ఆకాంక్షలు పూర్తిగా ఆవిరి అయిపోతాయి అని కార్మిక సంఘాల ఐక్యవేదిక  తన ప్రకటనలో  తెలిపింది.  లేబర్ కోడ్స్​ను వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ ఈ నెల 26న  'కార్మికుల నిరసన గళం’ పేరుతో  దేశవ్యాప్తంగా నిరసనలు జరపాలని సంయుక్త కార్మికసంఘాలు పిలుపునిచ్చాయి.

ఏకపక్ష నిర్ణయం సరికాదు

కార్మికుల సంఖ్య పదిమంది కంటే తక్కువ ఉన్న యూనిట్లను తనిఖీల నుంచి మినహాయించారు.  దీనివల్ల పని ప్రదేశాల్లో భద్రత,  ఆరోగ్యం,  పని పరిస్థితులు మరింత హీనస్థితికి  చేరే  ప్రమాదం ఉంది. అగ్ని ప్రమాదాలు, యంత్ర భద్రతా ప్రమాణాలపై బాధ్యత  లేకుండాపోతుంది. ఈ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, యాజమాన్య అనుకూల కార్మిక కోడ్స్​ను  ఏకపక్షంగా అమలు చేయడాన్ని కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక  తీవ్రంగా ఖండించింది.  లేబర్ కోడ్స్​ను ప్రజాస్వామికంగా నోటిఫై చేయడం ద్వారా కేంద్రం అన్ని ప్రజాస్వామిక సూత్రాలను కాలరాసిందని,  దేశ సంక్షేమ రాజ్య స్వభావాన్ని నామరూపాలు లేకుండా చేసిందని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు పది కేంద్ర కార్మికసంఘాలు స్వతంత్ర పారిశ్రామిక సంఘాలతో కూడిన సంయుక్త  వేదిక  ఒక  ప్రకటన  విడుదల చేసింది.

- ఉజ్జిని రత్నాకర్ రావు,
ఏఐటీయూసీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి