శ్రీలంకలో కరెంట్​ కట్​

శ్రీలంకలో కరెంట్​ కట్​

కొలంబో : ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను కరెంట్ కష్టాలు కూడా చుట్టుముడుతున్నాయి. దేశవ్యాప్తంగా కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో శనివారం రాత్రి కొలంబో సహా అన్ని పట్టణాల్లో ఎటు చూసినా అంధకారం అలముకుంది. కాట్ మలే, బియగమా మధ్య సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన విద్యుత్ లైన్ లో సిస్టమ్ ఫెయిల్యూర్ కావడంతో దేశవ్యాప్తంగా కరెంట్ సరఫరా నిలిచిపోయిందని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ప్రకటించింది. కరెంట్ సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపింది. 

కొన్ని గంటలు శ్రమించి దేశంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ సప్లైని పునరుద్ధరించామని, మిగతా ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు మరికొన్ని గంటలు పట్టొచ్చని అధికారులు తెలిపారు. దేశమంతటా ఒక్కసారిగా కరెంట్ బంద్ కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. కొన్నేండ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో గతేడాది నుంచి విద్యుత్ కోతలు కూడా వెంటాడుతున్నాయి. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి వల్లే కరెంట్ కోతలు పెరుగుతున్నాయని చెప్తున్నారు.