
ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, సాయికుమార్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా ‘జబర్ధస్త్’ ఫేమ్ శాంతి కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్నారు. ‘ఓసిని వయ్యారి రామ చిలుక’ అనే పాటను గురువారం లాంచ్ చేశారు.
పాట విడుదల చేసిన హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘ఇదొక ఫీల్‌గుడ్ సినిమా. నాన్న ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సత్య కశ్యప్ కంపోజ్ చేసిన సాంగ్ ఆకట్టుకుంటుంది. లిరిక్స్ చాలా అర్ధవంతంగా ఉన్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నాడు. ‘జబర్దస్త్ కమెడియన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు, పాటలు నేనే రాసుకుని నిర్మాతల సహకారంతో సినిమా పూర్తి చేశా’ అని దర్శకుడు శాంతి కుమార్ చెప్పాడు.