6,250 ఎకరాల్లో.. ప్రకృతి వ్యవసాయం .. ఉమ్మడి యాదాద్రి జిల్లాలో 50 క్లస్టర్లు ఎంపిక

6,250 ఎకరాల్లో.. ప్రకృతి వ్యవసాయం .. ఉమ్మడి యాదాద్రి జిల్లాలో 50 క్లస్టర్లు ఎంపిక
  • రైతులు, కృషి సఖిల ఎంపిక  పూర్తి
  • ముగిసిన ట్రైనింగ్​రైతులకు ప్రోత్సాహకం
  • ప్రాసెస్​లో బీఆర్​సీల ఎంపిక

యాదాద్రి, వెలుగు : రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా సహజమైన పద్దతుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్​ఎంఎఫ్​) స్కీమ్​ను ఈ సీజన్ నుంచి రెండేండ్లపాటు అమలు చేయనుంది. 

పశువుల నుంచి..

40 ఏండ్ల క్రితం ప్రతి రైతుకు పాడి సంపద ఉండేది. సాగులో పూర్తిగా పశువులు, పందుల నుంచి సేకరించే పేడనే రైతులు ఎరువుగా వాడేవారు. దాదాపు ఎక్కువ ఇండ్లలో పాల కోసం ఆవు లేదా గేదెను సాకుతుండడంతో వారిండ్ల నుంచి పేడ సేకరణ జరిగేది. రసాయన ఎరువుల వాడకం చాలా తక్కువగా ఉండేది. కాలక్రమేణ ట్రాక్టర్లు రంగ ప్రవేశం చేయడం,  పశు సంపద తగ్గిపోతూ ఉండడంతో రసాయన ఎరువుల వాడకం తీవ్రత పెరిగింది. ఈ పరిణామంతో సాగు ఖర్చు పెరిగి, భూమిలో సారం తగ్గుతూ 
వస్తోంది. 

ప్రకృతి వ్యవసాయంపై కేంద్రం దృష్టి..

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహించడంతోపాటు భూసారం తగ్గకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్​(ఎన్​ఎంఎఫ్​) స్కీమ్ అమలు చేస్తోంది. ఒకేసారి రైతులను ఒప్పించలేమనే ఉద్దేశంతో పైలట్​ప్రాజెక్టుగా ఒక్కో రైతు ఎకరమే సాగు చేయడానికి ప్లాన్​ చేసింది. ఈ ఎకరంలో సాగు చేసే పంటకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజ పద్దతుల్లోనే సాగు చేయాల్సి ఉంటుంది. ఇలా సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ.4 వేల చొప్పున రెండేండ్లపాటు ప్రోత్సాహకం ఇవ్వనుంది. 

ఉమ్మడి జిల్లాలో 6,250 ఎకరాలు..

ఉమ్మడి జిల్లాలో 50 క్లస్టర్లను ఎంపిక చేశారు. యాదాద్రి జిల్లాలో 20 కస్టర్లు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 15 చొప్పున ఎంపిక చేశారు. ఒక్కో కస్టర్​లో ఒక్కో రైతు ఎకరం చొప్పున  125 ఎకరాలను సాగు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఒక్కో  రైతు ఎకరం చొప్పున 6,250 ఎకరాలను సాగు చేయనున్నారు. భూమితోపాటు రైతుల ఎంపిక పూర్తయింది. ఆయా భూముల నుంచి మట్టి శాంపిల్​ను టెస్టింగ్​కు పంపించారు. రైతులకు సహజ సాగుపై అవగాహన కల్పించానికి ఎన్​జీవోలు ఎంపికయ్యాయి. రైతులకు ట్రైనింగ్​ కూడా పూర్తయింది. 

వంద మంది కృషి సఖీల ఎంపిక..

సహజ సాగు విషయంలో రైతులను మోటివేట్ చేయడానికి మహిళా సంఘాల నుంచి డీఆర్డీఏ సహకారంతో ఒక్కో క్లస్టర్​కు ఇద్దరు చొప్పున కృషి సఖీలను ఎంపిక చేశారు. సాగుపై అవగాహన ఉన్న వీరు రికార్డులు మెయింటెన్స్​ చేయడం, మీటింగ్​లకు రైతులను రప్పించాల్సి ఉంటుంది. ఒక్కో కృషి సఖికి ప్రతినెలా రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తారు.  

ప్రాసెస్​లో బీఆర్​సీల ఎంపిక..

సహజ సాగు విధానంలో పండించే  పంటలకు పాడి సంపద నుంచి సేకరించే పేడ, పంట వ్యర్థాలతో జీవామృతం తయారు చేయడానికి బయో రీసెర్చ్​ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రతి మూడు క్లస్టర్లకు రెండు బయో రీసెర్చ్​ సెంటర్​లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం పాడి సంపద కలిగి ఉండడంతో విద్యాధికుడైన రైతుల  ప్రక్రియ స్టార్ట్​ అయింది. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున అందించనున్నారు. ఈ మొత్తంతో జీవామృతం తయారు చేయడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం తయారు చేసిన జీవామృతాలను రైతులకు అందించాల్సి ఉంటుంది. 

రసాయన ఎరువులు లేకుండా పంట 

రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పాడి సంపద నుంచి లభించే పేడ, ప్రకృతిలో లభించే సహజ వనరులతో పంట సాగు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భూమిలో సారం పెరుగుతోంది. పర్యావరణానికి మేలు చేస్తుంది.

నీలిమ, ఇన్​చార్జ్​ డీఏవో, యాదాద్రి