
నోటి పూత లేదా మౌత్ అల్సర్ వచ్చినప్పుడు ఏం తినబుద్ధికాదు. అన్నం నమలడం కష్టంగా అనిపిస్తుంది. కొన్ని రకాల ఫుడ్స్ పడకపోవడంతో పాటు పోషకాలు లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది అంటోంది న్యూట్రిషనిస్ట్ మన్‌ప్రీత్ కర్లా. ఈ ప్రాబ్లమ్‌కి ఇతర కారణాలతో పాటు ఏం చేస్తే నోటి పుండ్లు తగ్గుతాయో చెప్పుకొచ్చిందిలా. నోరు శుభ్రంగా లేకున్నా కూడా నోటి పూత వస్తుంది. ఎసిడిక్‌గా ఉండే ఫుడ్ , బి12, బి6 వంటి విటమిన్ల లోపం, జింక్, ఫోలేట్ వంటివి అందకపోవడం కూడా నోటి పూతకు కారణం. పొట్టలో హెలికోబాక్టర్ ఫైలోరి అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ కారణంగా కూడా నోటి పుండ్లు ఏర్పడతాయి.
ఏం చేయాలంటే..బాగా నీళ్లు తాగడం, నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నోటి పూత రాకుండా జాగ్రత్తపడొచ్చు. కొబ్బరి నూనెతో పుక్కిలిస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గడమే కాకుండా నోటి పూత కూడా పోతుంది. విటమిన్ బి6, బి12 ఉన్న ఫుడ్‌తో పాటు బటానీలు, పప్పులు, నట్స్ తినాలి. జింక్, ఫోలేట్ కోసం జీడిపప్పు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు, ఓట్స్, బీట్రూట్ బాగా తినాలి. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ప్రొబయోటిక్స్ ఉన్న పెరుగు, మజ్జిగ వంటివి భోజనంలో ఉండాలి. ఉప్పు కలిపిన వేడినీళ్లతో పుక్కిలించినా కూడా నోటి పుండ్లు తగ్గిపోతాయి. చాలాసార్లు నోటి పూత దానంతట అదే పోతుంది. ఒకవేళ రెండు వారాలు అయినా కూడా సమస్య అలాగే ఉంటే డాక్టర్ని కలవాలి.