అడవిలో ప్రకృతి చెక్కినట్లుగా వెలిసిన రాతి స్తంభాలు

అడవిలో ప్రకృతి చెక్కినట్లుగా వెలిసిన రాతి స్తంభాలు
  • ఆరున్నర కోట్ల ఏండ్ల లావా చల్లారి ఏర్పడినట్లుగా గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర గ్రామపరిధి అడవిలోని రాళ్ల గుట్ట మీద ప్రకృతి చెక్కినట్లుగా ఉన్న రాతి స్తంభాలు వెలుగు చూశాయి. ఒకదాని వెంట ఒకటి పేర్చినట్లుగా ఉన్న నిలువు రాళ్లు.. ఏదో నిర్మాణ అవసరాల కోసం సిద్ధం చేసినట్లుగా ఉన్నాయి. ‘కాలమ్నార్ బసాల్ట్స్’గా పిలిచే వీటిని కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు గుర్తించారు.

ఆరున్నర కోట్ల ఏండ్ల కింద భూగర్భంలో నుంచి లావా పైకి వచ్చి, పరచుకుని గట్టిపడి వివిధ రూపాలను సంతరించుకుందని, అలా సహజసిద్ధంగా ఏర్పడినవే ఈ రాతి స్తంభాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సలహాదారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ చకిలం వేణుగోపాల్ వెల్లడించారు. ఎండిన బురద రేగడి నేలల్లో కనిపించే పగుళ్లలాగే చల్లారుతున్న లావా శిలా స్తంభాలుగా ఏర్పడిందని తెలిపారు.

తెలంగాణలో తొలిసారిగా 2015లో ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంతిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారెస్టులో, ఆ తర్వాత 2021లో ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ అడవిలో ఇలాంటి రాళ్లను గుర్తించారు. తాజాగా మూడో ప్రదేశాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీరామోజు హరగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. అయితే ఈ కాలమ్నార్ బసాల్ట్ విభిన్నమైనవని, మునుపటివాటిలాగా షట్కోణ, అష్టకోణాకృతులలో లేవని చెప్పారు. 

రక్షిత ప్రదేశంగా ప్రకటించాలి

కర్నాటకలోని ఉడిపి సమీపంలో సెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేరీ ద్వీపాల్లో ఇలాంటి రాతి స్తంభాలను గుర్తించిన జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ.. దేశంలో గుర్తింపు పొందిన 34 జాతీయ భూభౌతిక స్మారక ప్రాంతాల్లో ఒకటిగా చేర్చింది. విదేశాల్లోనూ ఇలాంటి వాటిని ప్రత్యేకంగా జియో టూరిజం కేంద్రాలుగా డెవలప్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అరుదైన ఈ రాతిస్తంభాలను ‘రక్షిత ప్రదేశం’గా ప్రకటించాలని తెలంగాణ వారసత్వశాఖను కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోరింది.