
ఎల్బీ నగర్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కస్టడీలో ఉన్న నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు రెండోరోజు (శనివారం) తెల్లవారుజామున మూసారాంబాగ్ లో అతడు ఉంటున్న రూమ్ కు తీసుకెళ్లినట్లు సమాచారం. అంతకుముందు రోజు (శుక్రవారం) హరిహరకృష్ణకు వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ టెస్ట్ లు చేయించారు. ఆ తర్వాత సరూర్ నగర్ లో ఉన్న ఎల్ బీనగర్ ఎస్ వోటీ ఆఫీసులో విచారించారు. డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలో ఈ కేసును ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి విచారిస్తున్నారు. అయితే విచారణకు హరిహరకృష్ణ సహకరించడం లేదని, నోరు విప్పి మాట్లాడటం లేదనే ప్రచారం నడుస్తోంది. ఈ కేసుతో సంబంధమున్న వారిని ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ శనివారం స్పష్టం చేశారు. యువతికి హత్యతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు తేలలేదన్నారు. హరిహర కృష్ణ నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నామని, అతడికి సహకరించిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అన్ని ఆధారాలు సేకరించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతి త్వరగా దోషులకు శిక్షపడేలా చేస్తామన్నారు.
హత్య చేసిన తర్వాత హెల్ప్ చేసిందెవరు ?
నవీన్ హత్యకు యువతికి సంబంధం ఉండొచ్చని నిందితుడు హరిహర కృష్ణ తండ్రి ఇటీవల ఆరోపించారు.నవీన్ ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ , ఆ అమ్మాయితో మాట్లాడాడనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో నవీన్ హత్యకు అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణకు దగ్గరి బంధువులు కానీ.. స్నేహితులు కానీ.. ఏమైనా సహకారం అందించారా అనే దానిపైనా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో హరిహరకృష్ణ తండ్రితో పాటు కొందరు బంధువులు, హాసన్ తో పాటు పలువురు స్నేహితులను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో పోలీసులు మినట్ టు మినట్ సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో క్రైం సీన్స్‌ను చూశాక.. నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్య చేశాక ఎలా తప్పించుకోవాలి ? సాక్ష్యాలను ఎలా తారుమారు చేయాలి ? అనే దానిపైనా ముందే అతడు ప్లాన్ చేసుకున్నాడని గుర్తించినట్లు సమాచారం.