
- గత బీఆర్ఎస్ సర్కార్ జూబ్లీహిల్స్‌ను నిర్లక్ష్యం చేసింది
- పేదల సమస్యలను వినేందుకు కూడా టైమ్ ఇచ్చేది కాదు
- తమది ప్రజా ప్రభుత్వమని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వెల్లడి
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి ప్రచారం
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు రెహమత్ నగర్ డివిజన్ నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. మంగళవారం నియోజకవర్గంలోని టి.అంజయ్యనగర్, ఆరోగ్యనగర్, నందునగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి ఆయన పర్యటించారు.
స్థానిక ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు జూబ్లీహిల్స్ కు అవసరమని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ ను నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం మాత్రం నెలల వ్యవధిలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం సుమారు రూ. 140 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ‘‘గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా.. ఉన్న రేషన్ కార్డులను తొలగించి పేద ప్రజల కడుపు కొట్టింది. ప్రజా ప్రభుత్వం మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేసి కడుపునిండా అన్నం తినేందుకు సన్న బియ్యాన్ని అందిస్తున్నది.
మరోవైపు ఉచితంగా 200 యూనిట్లు కరెంటు, మహిళలకు ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, వంట గ్యాస్ సబ్సిడీ వంటి అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్నది” అని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అత్యధిక మెజారిటీ అందించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి మీద ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సమస్యలను వినేందుకు కూడా సమయం ఇచ్చేది కాదని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజా ప్రభుత్వమని.. కష్టాలను, నష్టాలను చెప్పుకునే పేదలకు అవకాశం ఇస్తున్నదని ఆయన వివరించారు. కార్యక్రమంలో రెహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.