మావోయిస్టు నేత లొంగుబాటు

మావోయిస్టు నేత లొంగుబాటు

ఛత్తీస్‍గఢ్‌ లో మావోయిస్టు పార్టీ నేత లొంగిపోయారు. అనేక దాడుల వ్యూహకర్తగా భావిస్తున్న కుంట ఏరియా కమాండర్‌‌ అర్జున్ శుక్రవారం సుక్మా ఎస్పీ జితేంద్ర శుక్లా, సీఆర్‍పీఎఫ్‌ డిఐజీ సంజయ్‌ యాదవ్‍ ఎదుట లొంగిపోయారు. అర్జున్ మీద రూ.8లక్షల రివార్డు ఉంది.అర్జున్‌‌ లొంగుబాటుకు సంబంధించి పార్టీకి ముందుగానే సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ మీద తిరుగుబాటు ప్రకటించి చాలారోజుల కిందటే బయటకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దండకారణ్యంలో మావోయస్టు నేతలు ఇటీవల ప్రజాకోర్టు పెట్టి ఈ వ్యవహారం గురించి చెప్పినట్టు నిఘావర్గాల ద్వారా తెలుస్తోంది. రెండు రోజుల నుంచే అర్జున్‌‌ లొంగుబాటు మీద ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొంతకాలంగా సీఆర్‍పీఎఫ్ దండకారణ్యంలోని అబూజ్‍మాఢ్ చుట్టూ ఈమధ్య భారీగా బెటాలియన్లను ఏర్పాటు చేసింది. కూంబింగ్ చేయడంతోపాటు గిరిజనప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా ఆదివాసీలను ఆకట్టుకుంటున్నారు. దీంతో పాటు మావోయిస్టు ముఖ్య నేతల మధ్య విభేదాలు తలెత్తడంతో పార్టీలో అంతర్యుద్ధం నడుస్తుందని చెప్తున్నారు. ఇందులో భాగంగానే అర్జున్‌‌ లొంగుబాటు జరిగిందని భావిస్తున్నారు. దండకారణ్యంలో మరిన్ని లొంగుబాట్లకు యాక్షన్‌‌ప్లాన్‌‌ తయారు చేసినట్టు సీఆర్‍పీఎఫ్ ఐజీ సంజయ్‍యాదవ్‍, సుక్మా ఎస్పీ జితేంద్రశుక్లా విలేకర్ల సమావేశంలో చెప్పారు. అర్జున్ సుక్మా , దంతెవాడ జిల్లాల్లో దాడుల వ్యూహకర్త అని, అతని లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద లోటేనని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్నారు.