కేసీఆర్ పాలనతో మళ్లీ నక్సలిజం వస్తది : షబ్బీర్ అలీ

కేసీఆర్ పాలనతో మళ్లీ నక్సలిజం వస్తది : షబ్బీర్ అలీ

కామారెడ్డి,  వెలుగు :  కేసీఆర్​ పాలనతో  మళ్లీ నక్సలిజం వచ్చే చాన్స్​ ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత షబ్బీర్​అలీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని, తమకు న్యాయం జరగనప్పుడు ప్రజలు  తుపాకులు పట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.  టీఎస్​పీఎస్​సీ పేపర్ల లీకేజీపై శనివారం కామారెడ్డిలో జరిగిన   రౌండ్​టేబుల్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.  భూస్వాముల భూములను   పేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారని,  ధరణిలో మళ్లీ భూస్వాముల పేర్లే వస్తున్నాయని, ఎప్పుడో భూములు కొనుక్కున్న పేదల పేర్లు కూడా ధరణిలో నమోదు కావడంలేదని ఆరోపించారు.

నక్సలైట్లతోనే తమ సమస్యలు తీరుతాయన్న  భావన ప్రజల్లో వస్తోందన్నారు.  బడాబాబుల కోసం పేపర్లను లీక్​ చేశారని, నిద్రాహారాలు మాని  చదువుకున్న   పేద, మధ్యతరగతి నిరుద్యోగుల జీవితాలను  ఆగం చేశారన్నారు.  రాష్ర్ట ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.  ప్రభుత్వ వైఫల్యంతోనే   పేపర్ల లీకేజీ జరిగిందని   టీజేఎస్​ స్టేట్​ ప్రెసిడెంట్​  ప్రొఫెసర్​ కోదండరాం ఆరోపించారు.  టీఎస్​పీఎస్​సీ చైర్మన్​, మెంబర్లను తొలగించిన తర్వాతే మళ్లీ ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్నారు.

 టీజేఎసీ జిల్లా ప్రెసిడెంట్​ జగన్నాథం,  టీపీటీఎఫ్​ స్టేట్​ ప్రతినిధులు కె. వేణుగోపాల్​,   రమణ, బహుజన ఐక్య వేదిక ప్రెసిడెంట్​ క్యాతం సిద్దిరాములు,  బీఎస్పీ జిల్లా ప్రెసిడెంట్​ బాల్​రాజు,  టీజేఎస్​ స్టేట్​ జనరల్ సెక్రెటరీ నిజ్జన రమేశ్​  తదితరులు పాల్గొన్నారు.