సీఆర్పీఎఫ్ క్యాంపులపై డ్రోన్లతో నక్సల్స్ నిఘా

సీఆర్పీఎఫ్ క్యాంపులపై డ్రోన్లతో నక్సల్స్ నిఘా
  • గుర్తించిన సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు
  • ఛత్తీస్​గఢ్​లోని సుక్మాలో రెండు క్యాంపుల వద్ద ఘటనలు
  • మూడు రోజుల్లో నాలుగు సార్లు డ్రోన్ల చక్కర్లు
  • అప్రమత్తమయ్యేలోగా మాయం
  • క్యాంపుల్లో జరిగే యాక్టివిటీలను మానిటర్ చేస్తున్న నక్సల్స్!
  • అలర్ట్ ప్రకటించిన సెక్యూరిటీ

న్యూఢిల్లీ:

రోడ్లపై మందుపాతరలు పేల్చడం.. భద్రతా బలగాలను చుట్టుముట్టి తూటాల వర్షం కురిపించడం వంటి దాడులుచేస్తూ వస్తున్న మావోయిస్టులు అప్​డేట్ అయ్యారా? రాకెట్ లాంచర్లు, ఏకే 47లనుదాటి డ్రోన్లతో దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన సీఆర్పీఎఫ్ క్యాంపు దగ్గర్లో డ్రోన్లు లేదా మానవ రహిత ఏరియల్ వెహికల్స్ ఎగురుతూ ఉండటాన్ని బలగాలు గమనించాయి. దీంతో సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అలర్ట్​ అయ్యాయి. లెఫ్ట్ వింగ్ ఎక్స్​ట్రీమిజం ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్న ఫోర్సెస్​కు ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు ఇచ్చాయి.

3 రోజుల్లో 4 సార్లు

సుక్మా జిల్లాలో భద్రత ఏర్పాట్లు చూస్తున్న అధికారుల సమాచారం ప్రకారం.. ఎరుపు, తెలుపు లైటింగ్ విడుదల చేస్తున్న చిన్న డ్రోన్లు కిస్తారం, పల్లోడిలోని సీఆర్పీఎఫ్ క్యాంపుల వద్ద గత నెలలో కనిపించాయి. మూడు రోజుల్లో కనీసం నాలుగు సార్లు కనిపించాయి. ఆ డ్రోన్ల నుంచి చిన్నగా శబ్దాలు వస్తుండటంతో వాటిని బలగాలు గమనించాయి. దీంతో అప్రమత్తమయ్యాయి. నక్సల్స్​తో ప్రమాదం పొంచి ఉందంటూ దగ్గర్లోని అన్ని క్యాంపులకు అలర్ట్ పంపాయి. డ్రోన్లను టార్గెట్ చేసి, కాల్చేందుకు సైనికులు ప్రయత్నించినా.. వాటి జాడ కనపడలేదు.

ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఆందోళన

డ్రోన్ల కలకలంపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నక్సల్స్ పట్టు ఎక్కువగా ఉండ టం, ఆ రెండు క్యాంపుల వద్దకు కనీసం రోడ్డు కనెక్టివిటీ కూడా సరిగ్గా లేకపోవడం, అక్కడ సాయుధ మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతున్నాయి. ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ బోర్డర్​లో ఆ ప్రాంతాలు ఉండటంతో హెచ్చరికలు జారీచేశాయి. ‘‘ఈ పరిస్థితి తీవ్ర ఆందోళ న కలిగించేదే. మావోయిస్టులు డ్రోన్లను వినియోగించడం.. ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్​కు కొత్త చాలెంజ్” అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ‘‘ఎల్​డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల్లో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశాం” అని వివరించారు.

రిమోట్​తో నడిచేవే..

మావోయిస్టులు వాడుతున్న డ్రోన్లు బేసిక్​ వెర్షన్లని ఐబీ వర్గాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. వీటిని రిమోట్ ద్వారా కంట్రోల్​ చేస్తారని చెబుతున్నాయి. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో ఫొటోలు, వీడి యోలు తీసేందుకు ఉపయోగించే డ్రోన్ల వంటివేనని చెప్పాయి. ఈ నేపథ్యంలో ఏదైనా దాడి జరిగితే కౌంటర్​అటాక్​కు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నాయి. స్కై ఫెన్స్, డ్రోన్ గన్ వంటి యాంటీ డ్రోన్ ఆయుధాలను వినియోగించే ఆలోచన చేస్తున్నాయి.

ముంబైలో అమ్మకం?

ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన ఓ వ్యాపారి హస్తం ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. నక్సల్ క్యాడర్​కు చెందిన వ్యక్తులకు ఆయన డ్రోన్లు అమ్మినట్లు భావిస్తున్నాయి. డ్రోన్లను ఈ మధ్యే కొని ఉంటారని, భద్రతా బలగాల క్యాంపులపై నిఘా వేసేందుకు, లోపలి కార్యక్రమాలను మానిటర్ చేసేందుకు, తాము దాక్కున్న ఏరియాల్లో జవాన్ల అలికిడి గురించి ముందుగానే తెలుసుకునేందుకు వాటిని వాడుతున్నట్లు అంచనా వేస్తున్నాయి.