వివాదంపై విఘ్నేశ్‌ లేఖ

వివాదంపై విఘ్నేశ్‌ లేఖ

జూన్ 9న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన నయనతార, - విఘ్నేశ్‌ శివన్ జంట ఆ మరుసటి రోజే చిక్కుల్లో పడ్డారు. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం, ఆలయ ఆవరణలో ఫొటోషూట్‌ చేసుకోవడంతో వివాదం నెలకొంది. దీనిపైన టీటీడీ కూడా సీరియస్ అయింది. వారిపైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. అయితే ఈ వివాదం పైన విఘ్నేశ్‌ శివన్‌ వివరణ ఇస్తూ ఓ లేఖను రిలీజ్ చేశారు. ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని, దేవుడిపైన  నమ్మకం, భక్తి ఉందని, తెలియక చేసిన ఈ తప్పును క్షమించాలని ఆ లేఖలో కోరారు. 

" వాస్తవానికి మా పెళ్లి అక్కడే  చేసుకోవాలని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. దీనితో మహాబలిపురంలో చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లైన వెంటనే స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం..అందుకే దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత మా పెళ్లి ఇక్కడే జరిగిందనే భావన కలగడం కోసం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆలయ ఆవరణలో ఫొటోషూట్‌ చేసుకోవాలనుకున్నాం. అయితే అప్పటికే భక్తలు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుండి వెళ్లిపోయి తిరిగి మళ్లీ వచ్చాం.  వెంటనే ఫొటోషూట్‌ కంప్లీట్ చేసుకుని వెళ్లిపోవాలని అనుకున్నాం. ఈ గందరగోళ పరిస్థితుల్లో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. అంతేకానీ దేవుడిని అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి" అని విఘ్నేశ్‌ తెలిపాడు.