
గ్యాంగ్‌స్టర్, మాజీ నక్సలైట్ నయీం హత్యకేసు విషయంలో ఇప్పటికీ చాలా అనుమానాలున్నాయి. వాటన్నింటికీ సమాధానమే తన సినిమా అంటున్నారు దర్శకుడు దాము బాలాజీ. ఆయన రూపొందించిన ‘నయీం డైరీస్’ డిసెంబర్ 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బాలాజీ ఇలా ముచ్చటించారు.
నయీంగా తనే కరెక్ట్!
ఈ పాత్రకి నాకు వశిష్ట సింహాయే కరెక్ట్ అనిపించింది. తనది కరీం నగర్. వాళ్ల పూర్వీకులు మైసూర్ వలస వెళ్లారు. ఇప్పటికీ ఇంట్లో తెలుగే మాట్లాడతారు. అదీ సినిమాకి హెల్పయింది. తెలంగాణ శ్లాంగ్‌లో చక్కగా డబ్బింగ్ చెప్పాడు. నయీంని పోలి నట్టు చూపిస్తే కామిక్‌గా అవుతుంది తప్ప సీరియస్‌నెస్ రాదు. అందుకే క్యారెక్టరైజేషన్ తప్ప పోలికలు చూపించాలనుకోలేదు.
తప్పేమీ లేదు
నయీంకి, తన వైఫ్‌కి మధ్య రొమాంటిక్ సీన్ ఉంది. ట్రైలర్‌లో కొన్ని సెకన్సే కనిపించినా ‘బిగ్‌బాస్’ ఫేమ్ దివి ఆ పాత్ర చేయడంతో, యూట్యూబ్ చానల్స్ ఎక్కువ హైలైట్ చేశాయి. సినిమాలో రొమాన్స్ చాలా తక్కువ. నయీం, బెల్లి లలితల మధ్య లిప్ లాక్ మాత్రం ఉంటుంది. నయీం నేరచరిత్ర వల్ల చాలామంది వాళ్ల రిలేషన్‌ని ఒప్పుకోవట్లేదు. ఆమె నయీంని ఇష్టపడింది నక్సలైట్‌గా ఉన్నప్పుడు. తను వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఇష్టపడటంలో తప్పేం లేదుగా.
కచ్చితంగా హత్యే!
నయీంని చంపించడానికి గల అసలుకారణాలను చూపించాను. అది కచ్చితంగా హత్యే. నయీంపై 758 కేసుల్లో చార్జ్‌షీట్స్ ఉన్నాయి. ఒక్క పోలీస్ పేరు కూడా లేదు. గవర్నమెంట్ అంత ట్రాన్స్పరెంట్గా ఉంటే ఈ కేసుకు సంబంధం ఉన్న వాళ్లందరినీ ఎందుకు వదిలేసింది? కేసులెందుకు పెట్టలేదు? 25 మంది పోలీసాఫీసర్స్‌ను సస్పెండ్ చేసి మళ్లీ ఎందుకు తీసుకున్నారు?130 కేసుల్లో 8 మంది చోటా నాయకుల పేర్లే ఉన్నాయి. మెయిన్ లీడర్స్ పేర్లు లేవు. నయీంని పెంచి పోషించిన వాళ్లందర్నీ ప్రభుత్వం కాపాడుతోంది.
నిజాలే చూపించా
డబ్బు కోసమో, కాంట్రవర్సీల కోసం ఈ సినిమా తీయలేదు. నిజాలేమిటో చూపించేందుకే తీశా. దాదాపు 23 పెద్ద సెన్సార్ కట్స్ ఇచ్చారు. ఆ కట్స్ తీసేస్తే సినిమానే లేదు. రివైజింగ్ కమిటీకి వెళ్లి సెన్సార్ పూర్తి చేశాం. ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు.
భయపడేదే లేదు
ఈ సినిమా పోలీసులకు వ్యతిరేకంగా ఉందని, సినిమా రిలీజ్ కాకుండా కేసు పెడతానని ఓ పోలీసాఫీసర్ హెచ్చరించారు. బెల్లి లలిత సీన్స్ తీసేయాలని ఆమె రిలేటివ్స్, తనతో కలిసి పనిచేసిన వాళ్లు, కుల సంఘాల వాళ్లు ఫోన్లు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కూడా ఫోన్ చేసి గవర్నమెంట్‌కి సంబంధించిన సీన్స్ తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఐ డోన్ట్ కేర్. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా ఏ సీన్ కూడా తీసేసే ప్రసక్తే లేదు. నేను చూపించినవన్నీ వాస్తవాలే. ఎవరికో భయపడి తీసేసే ఆలోచన లేదు. నేనేమీ నయీంని హీరోగా చూపించ లేదు. ఎంత క్రూరంగా హత్యలు చేశాడో కూడా చూపించాను. దేన్నీ దాచిపెట్టలేదు. తను కచ్చితంగా క్రిమినలే. కానీ ఇండిపెండెంట్ క్రిమినల్ కాదు. తనను అలా తయారు చేసిన నక్సలైట్స్, పోలీసాఫీసర్స్, పొలిటీషియన్స్ కూడా క్రిమినల్స్ అవుతారా లేదా అనేదే ఈ సినిమా ద్వారా నేను సంధించిన ప్రశ్న.
ఇది వర్మ కోసం రాసిన స్క్రిప్ట్. ఆయన తీయకపోవడంతో నేను తీశా. ట్రైలర్ చూసి నైస్ అన్నారు. ఇప్పటికీ ఆయన ఈ సబ్జెక్ట్ పై సినిమా తీసే ఆలోచనలో ఉండే ఉంటారు. కానీ మా ఇద్దరి పర్‌స్పెక్టివ్ వేరు. వర్మ అయితే నయీమ్ ఎంత క్రూరుడనేది మాత్రమే చూపిస్తారు. కానీ అతనలా కావడానికి కారణమైన పరిస్థితుల్ని కూడా నేనిందులో ప్రొజెక్ట్ చేశాను. నయీంని ఎవరు ఎలా తయారుచేశారు, ఎలా వాడుకున్నారు, ఎలా చంపేశారు అనేదే ఈ సినిమాకి మెయిన్ థీమ్.