Mucherla Aruna : నటి ముచ్చర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు: కారణమేమిటి?

Mucherla Aruna : నటి ముచ్చర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు:  కారణమేమిటి?

అలనాటి అందాల నటి ముచ్చర్ల అరుణ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైలోని కపాలీశ్వరర్ నగర్‌లో ఉన్న  బంగ్లాలోఈడీ అధికారులు తనిఖీలు చేపట్టిపట్టారు.  ఆమె భర్త మోహన్‌ గుప్తాకు సంబంధించిన వ్యాపార అక్రమ లావాదేవీలపైనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం.  ఈడీ బృందం మోహన్‌ గుప్తా నిర్మాణ రంగంలో కొనసాగుతున్న వ్యాపారాలకు సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. 

ముచ్చర్ల అరుణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. ముఖ్యంగా 1980వ దశకంలో ఆమె అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె కెరీర్‌లో 'సీతాకోక చిలుక' సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ముచ్చర్ల అరుణ, ఆ తర్వాత 'చంటబ్బాయ్', 'జస్టిస్ చౌదరి' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 'గీతాంజలి' చిత్రంలో ఆమె అతిథి పాత్రలో మెరిశారు. వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై, కుటుంబ జీవితానికే అంకితమయ్యారు.

►ALSO READ | Badass First Look: సిద్ధూ జొన్నలగడ్డ 'బడాస్' ఫస్ట్ లుక్ వైరల్: మాస్ అవతార్‌లో రచ్చ!

మోహన్ గుప్తా నిర్మాణ రంగంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపార కార్యకలాపాల్లో మనీలాండరింగ్ లేదా ఇతర ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. సోదాల సందర్భంగా కీలక పత్రాలు, డిజిటల్ డేటా, ఆర్థిక రికార్డులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈడీ సోదాలు ముగిసిన తర్వాత, దర్యాప్తు పురోగతి ఆధారంగా మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. అలనాటి నటి నివాసంలో ఈడీ దాడులు జరగడం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.