స్టాఫ్​ అంతా.. ట్రాన్స్​జెండర్స్

స్టాఫ్​ అంతా.. ట్రాన్స్​జెండర్స్

ఏదైనా కేఫ్​ లేదా రెస్టారెంట్​కి వెళ్తే .. అక్కడి యాంబియెన్స్​, ఫేమస్​ ఫుడ్  లేదా  స్పెషల్​ సర్వీస్​ల గురించి మాట్లాడుకుంటారు ఎవరైనా. కానీ, ముంబైలోని ‘బంబయ్​ నజరియా’ కేఫ్​లో అడుగు పెడితే మాత్రం కేవలం ఆ కేఫ్​ గురించే మాట్లాడుకుంటారు. ఎందుకలా అంటే? ఫర్​ ఏ ఛేంజ్​ అంటూ ఓ కొత్త ఆలోచనతో జనాల ముందుకొచ్చింది ఈ కేఫ్​. సొసైటీలో ట్రాన్స్​జెండర్స్​పై ఉన్న అభిప్రాయాల్ని మార్చడానికి వాళ్లకి మాత్రమే ఎంప్లాయిమెంట్​ కల్పిస్తున్నారు ఇక్కడ. ‘నజరియా బద్​లో నజారా బద్​లేంగా’ అంటూ అందర్నీ ఆలోచింపజేస్తున్న ఈ కేఫ్​ ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది ఇంటర్నెట్​ అయింది.

కాలం ఎంత ముందుకెళ్తున్నా.. ఎన్ని రకాలుగా అవేర్​నెస్​ కల్పించినా... ట్రాన్స్​జెండర్స్​పై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవట్లేదు జనాలు. సొసైటీలో గుర్తింపు కోసం..అందరితో సమానంగా అవకాశాల కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు వాళ్లు​. అందుకే సొసైటీకి,  ట్రాన్స్​జెండర్స్​కి మధ్యనున్న  గ్యాప్​కి ఓ బ్రిడ్జ్​లా వచ్చింది ఈ బంబయ్​నజరియా కేఫ్​. ఇందులో పనిచేసేవాళ్లంతా.​. వెయిటర్స్​, స్వీపర్స్​, చెఫ్​లు  కిచెన్​ నుంచి సర్వీసెస్​ వరకు అన్నింట్లో ట్రాన్స్​ జెండర్సే ఉంటారు. టేస్టీ పావ్ బాజీ, కీమా, మసాలా పావ్​, కాశ్మీరి పింక్​ చాయ్​లు అందిస్తారు. అన్నట్టు ఈ కేఫ్​ ముంబై అంధేరి వెస్ట్​లోని వెర్సోవాలో ఉంది. ‘నజరియా బద్​లో... నజారా బద్​లేంగా’ అనే ట్యాగ్​లైన్​ కూడా యాడ్​ చేశారు ఈ కేఫ్​ నేమ్​ బోర్డ్​ కింద. అది కాస్త ఫేమస్​ ఫుడ్​ బ్లాగింగ్​ అకౌంట్​‘ ఫుడ్డీ టేల్స్​’ దృష్టిలో పడటంతో  వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. ఆ వీడియోకి వేలల్లో లైక్స్​ వచ్చాయి. చాలామంది ఈ కేఫ్​కి వెళ్లి తీరాల్సిందే అని కామెంట్లు కూడా పెడుతున్నారు. అలాగే ఇంత మంచి ఆలోచన చేసిన ఈ కేఫ్ ఫౌండర్స్​ని మెచ్చుకుంటున్నారు. 

యాంబియెన్స్​ మరో అట్రాక్షన్​ 

ఈ కేఫ్​కి మరో స్పెషల్​ అట్రాక్షన్​ యాంబియెన్స్. కస్టమర్స్​కి హోమ్లీ ఫీలింగ్​ ఇవ్వడానికి అచ్చు ఇంటిలానే  ఈ కేఫ్​ని డిజైన్​ చేశారు నిర్వాహకులు. హ్యాంగింగ్​ లైట్స్​.. చెక్క కుర్చీలు, బల్లలతో వింటేజ్​ లుక్​ తెచ్చారు కేఫ్​కి. ఇండోర్​ ప్లాంట్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవా ల్సిందే. రెట్రో స్టైల్​ అద్దాలు, రేడియోలు, మెషిన్లు కూడా చూడొచ్చు ఈ కేఫ్​లో. ఒకప్పటి బ్లాక్​ అండ్​ వైట్​ టీవీలు కూడా కనిపిస్తాయి. జీవితం విలువని చెప్పే పెయింటింగ్స్​ కూడా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా కేఫ్​లో అక్కడక్కడా బ్లాక్​ బోర్డులు ఉంటాయి. వాటిపై కూడా  ‘‘నజరియా బద్​లో... నజారా బద్​లేంగా’’ అని రాసి ఉంటుంది. ఫుడ్​ విషయంలోనూ మంచి మార్కులే పడుతున్నాయి ఈ కేఫ్​కి. ముంబై ఫేమస్​ డిష్​లతో పాటు మరెన్నో స్పెషల్స్​ని ట్రాన్స్​జెండర్స్​ నవ్వుతూ వడ్డిస్తున్నారు. 

‘‘మా నాన్నకి ట్రాన్స్​జెండర్​ కమ్యూనిటీ కోసం ఏదైనా చేయాలని తన చిన్నప్పట్నించీ ఉండేది. దాంతో  ఆయన కలని నిజం చేయడానికి ఏడేండ్ల కిందట ఈ ఆలోచన చేశా. ఆ ఆలోచననే రెండు నెలల కిందట నా భర్తతో  కలిసి ఆచరణలోకి తీసుకొచ్చా. కస్టమర్స్​కి ఓల్డ్​ ముంబై ఫీలింగ్​ కలిగించడానికి బంబయ్​ అని.. ట్రాన్స్​జెండర్స్​ని చూసే విధానంలో మార్పు రావాలన్న ఉద్దేశంతో నజరియా అని రెండింటిని కలిపి కేఫ్​కి​ పేరు పెట్టా. ట్రాన్స్​జెండర్స్​ గురించి జనాలు మరింత తెలుసుకోవడానికి.. వాళ్లకి సమానంగా అవకాశాలు కల్పించడానికి ఈ కేఫ్​ మంచి ప్లాట్​ఫాంగా మారింది.  చాలామంది మా ఆలోచనని గౌరవిస్తున్నారు.. ట్రాన్స్​జెండర్స్​తో ప్రేమగా మాట్లాడుతున్నారు అంటోంది ​ ఫౌండర్స్​లో ఒకరైన మిరండా.  ఈ విషయంలో కేఫ్​లో పనిచేస్తున్న ట్రాన్స్​జెండర్స్ కూడా ఫుల్​ ఖుష్​గా ఉన్నారు.