
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ కూటమికి సవాల్‌గా మారిన సీట్ల పంపకం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అనేక చర్చల తర్వాత ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ షేరింగ్ కుదిరింది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇందులో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29, రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో బరిలోకి దిగనున్నాయి.
ఈ మేరకు బీహార్ ఎన్నికల బీహార్ ఎన్నికల ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్డీఏ సీట్ల పంపకంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటన చేశారు. బీజేపీ 101, జేడీయూ 101, ఆర్ఎల్ఎం 6, హెచ్ఏఎం 6, ఎల్జేపీ ఆర్ 29 స్థానాల్లో పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఎన్డీఏ మిత్రపక్షాలు సుహృద్భావ వాతావరణంలో సీట్ల పంపిణీని పూర్తి చేశాయని తెలిపారు.
ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు, నాయకులందరూ సీట్ షేరింగ్ ఫార్ములాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు బీహార్ సిద్ధంగా ఉందని.. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపకాన్ని ఎల్జేపీ ఆర్ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వాహా, జితన్ రామ్ మాంఝీలు స్వాగతించారు.
అయితే, సీట్ల పంపకాల్లో భాగంగా హిందుస్తానీ అవామ్ మోర్చాకు ఆరు లేదా ఏడు సీట్లు మాత్రమే ఇస్తామనడంతో జితన్ రామ్ మాంఝీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం 15 సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ తమకు తగిన సీట్లు కేటాయించకపోతే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని లేదా ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని మాంఝీ హెచ్చరించారు. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగి మాంఝీతో చర్చించింది. చివరకు మాంఝీ ఆరు సీట్లకు ఒప్పుకున్నాడు. దీంతో ఎన్డీఏ కూటమిలో నెలకొన్న సీట్ షేరింగ్ ప్రతిష్టంభనకు తెరపడింది.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2025, నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ నిర్వహించునుంది ఈసీ. 2025, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. విజయం కోసం అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి.