ఏటేటా మారుతున్న ఫోకస్‌

ఏటేటా మారుతున్న ఫోకస్‌
  • ఈ ఏడాది దేనికి ప్రాధాన్యం?.. నిధులు ఎవరికి.. కోత దేనికి
  • పన్ను పోటు తగ్గనుందా లేదా?
  • పార్లమెంట్ నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోడీ సర్కారు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి వార్షి క బడ్జెట్ కావడంతో అందర్లోనూ అంచనాలు పెరిగాయి. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ప్రభుత్వం , ఏ రంగానికి ప్రాధాన్యమివ్వనుంది? ఆదాయపన్నులో మధ్యతరగతికి ఎలాంటి ఉపశమనం లభించనుందనే ప్రశ్నల నేపథ్యంలో.. గత ఐదేళ్లలో ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లు , కేటాయింపుల వివరాల పరిశీలన..

పీఎం కిసాన్​ యోజన (2019‌‌‌‌-20 ఇంటీరిమ్)

రైతులకు దన్నుగా, మధ్యతరగతికి పన్నుల భారం నుంచి ఉపశమనం కలిగించేలా మంత్రి పీయూష్​గోయెల్ ఫిబ్రవరిలో ఈ ఇంటీరిమ్ బడ్జెట్​ను ప్రవేశ పెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం మధ్యతరగతికి పన్ను భారం తగ్గించడమేనని ప్రభుత్వం ప్రకటించింది. లోక్​సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్​లో ఆదాయపన్నులో మార్పులుచేసి ప్రభుత్వం పన్ను భారాన్ని కాస్త తగ్గించింది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచే క్రమంలో ఏటా ఆదాయ పథకంలో రూ.75 వేల కోట్లు ఇన్వెస్ట్​చేయనున్నట్లు ప్రకటించింది. చిన్న రైతులకు అండగా ఉండేందుకు పీఎం కిసాన్​స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద రైతులకు ఏటా రూ.6 వేలు అందించనున్నట్లు పేర్కొంది. అనార్గనైజ్డ్​రంగంలోని కార్మికులకు పెన్షన్​స్కీంను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇన్ కంటాక్స్​ రిబేట్ ను రూ.5 లక్షల వరకు పెంపు, ఆయుష్మాన్ భారత్ స్కీం కు రూ.6 వేల కోట్లకు పైగా కేటాయింపులు

ఆర్గానిక్ ​సాగుకు ప్రోత్సాహం  (2018-19)

వ్యవసాయ రంగంపైనే ప్రధానంగా ఫోకస్​చేస్తూ రూపొందించిన బడ్జెట్​ఇది. ఎన్డీయే ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్.. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీ బడ్జెట్​ప్రవేశ పెడుతూ ఆర్గానిక్​సాగును ప్రోత్సహించేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కనీస మద్దతు ధర పెంపు, వ్యవసాయ మార్కెట్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ఫండ్​కు రూ.2వేల కోట్లు కేటాయింపు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రమోట్​చేసేందుకు ఆపరేషన్​గ్రీన్​పేరుతో ఫండ్​ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించింది. సమగ్ర గ్రామీణాభివృద్ధి, విద్య, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, చిన్న, మధ్యతరహా పరిశ్రమల బలోపేతానికి చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం ఈ బడ్జెట్​లో ప్రాధాన్యమిచ్చింది. పలు ఉత్పత్తులపై దిగుమతి, కస్టమ్స్​పన్నులను పెంచింది. ఇన్​కం టాక్స్​స్లాబ్​లలో ఎలాంటి మార్పులు చేయలేదు. సీనియర్​సిటిజన్లకు కొంత ఉపశమనం కలిగించినా.. అరవై ఏళ్ల లోపున్న వారికి ఆదాయపన్ను ఎలాంటి రిబేట్​కల్పించలేదు. నేషనల్​హెల్త్​ప్రొటెక్షన్​స్కీం కింద 10 కోట్ల బలహీన కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పించింది.

వ్యవసాయ మార్కెట్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ఫండ్​కు రూ.2 వేల కోట్ల కేటాయింపు, 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా

బ్యాంకుల రీకాపిటలైజేషన్ ​(2016–17)

ఎన్డీఏ సర్కారు పాలనలో మంత్రి అరుణ్​జైట్లీ ప్రవేశపెట్టిన మూడో వార్షిక బడ్జెట్.. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా రూ.35,984 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్​లో బ్యాంకులకూ తగిన ప్రాధాన్యం దక్కింది. పబ్లిక్​సెక్టార్​లోని బ్యాంకుల రీకాపిటలైజేషన్​కోసం రూ.25 వేల కోట్లు కేటాయించింది. ముద్ర స్కీం కింద రుణ పంపిణీ టార్గెట్​ను రూ.1,80,000 కోట్లకు పెంచింది. రోడ్లకు రూ.27 వేల కోట్లు, హైవేలకు రూ.55 వేల కోట్లతో మొత్తంగా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​రంగానికి రూ.2,21,246 కోట్లు కేటాయించింది.

ముద్ర రుణాల పంపిణీ టార్గెట్  రూ.1.80 లక్షల కోట్లకు పెంపు

రైతు రుణాలకు వడ్డీ మాఫీ (2017-18)

నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్.. సాగు, ఆరోగ్యం సహా పది అంశాలపై ఫోకస్. రైతు రుణాల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయింపు, రుణం తీసుకున్న ప్రతీ రైతుకు వడ్డీ మాఫీ అమలు, నాబార్డ్​ఫండ్​రూ.40 వేల కోట్లకు పెంపు, మైక్రో ఇరిగేషన్​కు రూ.5 వేల కోట్ల కార్పస్​ఫండ్​ఏర్పాటు.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టిసారించింది. మిషన్​అంత్యోదయ, ఉపాధి హామీ పథకానికి రూ.48 వేల కోట్ల కేటాయింపులతో పాటు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్​యోజన, ప్రధాన మంత్రి ఆవాస్​యోజనకు ఈ బడ్జెట్​లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు వివిధ పథకాలకు రూ.1.84 లక్షల కోట్లు వెచ్చించింది. రవాణా రంగంలోని వివిధ సెక్టార్లకు రూ.2 లక్షల కోట్లు, రైల్వేకు రూ.1.31 లక్షల కోట్లు కేటాయించింది.

ఇన్​కం టాక్స్​లో 2.5 నుంచి 5 లక్షల స్లాబ్​కు గతంలో ఉన్న 10 శాతం ఉన్న టాక్స్ రేట్ ను 5 శాతానికి తగ్గించడం

డిజిటల్ ​ఇండియా దిశగా (2014-15)

మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్.. ఇన్​కం టాక్స్​లిమిట్​ను రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంపు, సీనియర్​సిటిజన్లకు రూ.3 లక్షల వరకు మినహాయింపు. పీపీఎఫ్​లో పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు మినహాయింపును కల్పించింది. 100 స్మార్ట్​సిటీలకు రూ.7 వేల కోట్లు కేటాయించింది. డిజిటల్​ఇండియా ఇనిషియేటివ్​కింద గ్రామీణ స్థాయిలో బ్రాడ్​బ్యాండ్​కనెక్షన్​కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రస్తావించింది. గ్రామీణ ఉద్యోగులకు ఐటీ ట్రైనింగ్ కోసం నిధుల కేటాయింపు.. గంగా నదీ ప్రక్షాళన కోసం ‘నమామి గంగే’ స్కీం ప్రవేశపెట్టి రూ.2 వేల కోట్లు కేటాయించింది. పబ్లిక్​సెక్టార్​లోని బ్యాంకుల రీకాపిటలైజేషన్​కోసం రూ.11,200 కోట్లు కేటాయించింది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం 49 శాతానికి పెంచింది.

వంద స్మార్ట్​సిటీలకు రూ.7 వేల కోట్ల కేటాయింపు. నమామి గంగే స్కీంకు రూ.2 వేల కోట్లు

అటల్ ​పెన్షన్ ​యోజన  (2015–16)

రాష్ట్రాల సాధికారత, కో ఆపరేటివ్​ఫెడరలిజంను ప్రోత్సహించే దిశగా ఫోకస్​చేసిన బడ్జెట్.. ఇందులో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపైన దృష్టి కేంద్రీకరించింది. అనార్గనైజ్డ్​రంగంలోని కార్మికుల కోసం అటల్​పెన్షన్​యోజన పథకం ప్రవేశపెట్టి, నిధులను కేటాయించింది. అరవై ఏళ్లు దాటిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్​చెల్లించేందుకు దీనిని తీసుకొచ్చింది. ఉద్యోగ కల్పన, అభివృద్ధికి మేక్​ఇన్​ ఇండియా స్కీం, ముద్ర స్కీం ద్వారా చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సహించింది. దేశీయంగా ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా అభివృద్ధి, ఉద్యోగ కల్పన, బ్లాక్​మనీని అరికట్టడంపై ఈ బడ్జెట్​లో ప్రభుత్వం ఫోకస్​పెట్టింది.

బ్లాక్​మనీని అణిచివేత, ఉద్యోగ కల్పన, దేశీయ ఉత్పాదకతను ప్రోత్సహించడం