వరదలో చిక్కుకున్న తండ్రీ కొడుకులను కాపాడాడు కానీ..

వరదలో చిక్కుకున్న తండ్రీ కొడుకులను కాపాడాడు కానీ..
  • తండ్రీకొడుకులను కాపాడి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు
  • నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఘటన

నెల్లూరు: వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో వరద సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో వరదలో చిక్కుకున్న తండ్రీ కొడుకులను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తన లైఫ్ జాకెట్ ఊడిపోవడంతో చనిపోయాడు. వరద సహాయక చర్యల్లో శనివారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. 
నెల్లూరు జిల్లాలో వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా రంగంలోకి దిగి అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో బుచ్చి మండలం దామరమడుగు గ్రామం వద్ద వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. కానిస్టేబుల్ శ్రీనివాసరావు లైఫ్ జాకెట్ ధరించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఇదే క్రమంలో తండ్రీ కొడుకులను తరలిస్తుండగా.. తన లైఫ్ జాకెట్ ఊడిపోయింది. తండ్రీకొడుకులను ఒడ్డుకు చేర్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు తాను మాత్రం బయటపడలేక నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. సహచర బృందం వారు గుర్తించి స్పందించి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. 
ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వరదలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం విషాదం రేపింది. చనిపోయిన కానిస్టేబుల్ విజయరావు విజయనగరం జిల్లా ఐదవ బెటాలియన్ లో పనిచేస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ విజయరావు, ఇతర పోలీసు అధికారులు కానిస్టేబుల్ శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులర్పించి సంతాపం తెలియజేశారు.