NED vs SL: డచ్ బ్యాటర్ల అసమాన పోరాటం.. ధోనీ-జడేజా ఆల్ టైమ్ రికార్డు బద్దలు

NED vs SL: డచ్ బ్యాటర్ల అసమాన పోరాటం.. ధోనీ-జడేజా ఆల్ టైమ్ రికార్డు బద్దలు

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనా.. డచ్ బ్యాటర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌.. 262 పరుగులు చేయగలిగిందంటే అది ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్ వల్లే. వీరిద్దరూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయటమే కాదు.. లంకేయుల ఎదుట పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించగలిగారు. ఈ క్రమంలో ఈ జోడి 48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఎంగెల్‌బ్రెచ్ట్ - లోగాన్ వాన్ బీక్ జోడి ఏడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం. గతంలో ఈ రికార్డు భారత క్రికెటర్లు ఎంఎస్ ధోనీ- రవీంద్ర జడేజా పేరిట ఉండేది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 2019లో న్యూజిలాండ్‌పై 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అది 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించకపోయినా.. వీరిద్దరి పోరాటం ఒక అధ్యాయమనే చెప్పాలి. కివీస్ నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 221 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో లంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ నిర్ధేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి.. మరో పది బంతులు మిగిలివుండగానే మ్యాచ్‌ను ముగించింది.