సక్సెస్​ కోసం సాయం కావాలె

సక్సెస్​ కోసం సాయం కావాలె

 మెరుగైన  సప్లయ్ చెయిన్‌, ఇన్‌‌‌‌ఫ్రా, సులభంగా నిధులు కోరుతున్న గ్రామీణ స్టార్టప్​లు 
ఎదుగుదలకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వానికి వినతి

 

 రీసెర్చ్​లను, ఇన్నోవేషన్లను ప్రోత్సహించడంలో గ్రామీణ స్టార్టప్‌‌‌‌లు ముందుంటున్నాయి. అయితే, వీటికి సవాళ్లూ బాగానే ఉన్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి కొంత సాయాన్ని కోరుకుంటున్నాయి. సప్లయ్‌ చెయిన్‌, రాయితీలు, మెరుగైన మౌలిక సదుపాయాలు,  ఫైనాన్స్‌‌‌‌కు సులభంగా యాక్సెస్ కావాలని రిక్వెస్ట్​ చేస్తున్నాయి. బడ్జెట్,  లోక్‌‌‌‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున వివిధ రంగాల స్టార్టప్‌‌‌‌లు, ప్రత్యేకించి చిన్న పట్టణాలు,  గ్రామాలకు చెందినవి ప్రభుత్వం తమను పట్టించుకోవాలని కోరుతున్నాయి.

 "కాలం చెల్లిన పరికరాలు, మెరుగ్గాలేని సప్లయ్‌ చెయిన్‌, పేలవమైన మౌలిక సదుపాయాలు,  పరిమిత ఫైనాన్స్ లభ్యత వంటి అనేక ఇబ్బందులను ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఎదుర్కొంటోంది. మేం మా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లకు ఎగుమతి చేయడానికి ప్రపంచ సప్లయ్‌ చెయిన్‌లతో కనెక్ట్ అవ్వడానికి ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం”అని క్రినీ స్పైసెస్ ఫౌండర్​ పర్దీప్ కుమార్ యాదవ్ చెప్పారు.

 మార్చి 2017లో స్థాపించిన క్రినీ స్పైసెస్​కు 22 మంది ప్రత్యక్ష,  100 మందికి పైగా పరోక్ష ఉద్యోగులు ఉన్నారు.  ఇది 2022-–23లో రూ. 4.19 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.  వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌‌‌‌లను ప్రారంభించే గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తలకు మద్దతుగా ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్​కు మరిన్ని నిధులు ఇవ్వాలని కుమార్​ కోరారు. చాలా స్టార్టప్​లు ఈసారి బడ్జెట్​లో ఎగుమతి విధానాలను సడలించాలని కోరాయి. 

ప్రభుత్వం వచ్చే నెలలో పార్లమెంటులో వోటాన్​ అకౌంట్‌‌‌‌ను సమర్పించనుంది. పూణేకు చెందిన ఐరిస్ పాలిమర్స్ వ్యవసాయ,  పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్స్​ను తయారు చేస్తుంది. తమను అంతర్జాతీయ సరఫరా,  అమ్మకాల గొలుసులతో కనెక్ట్​ చేస్తే ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం, ఫినిష్డ్​ ప్రొడక్టులను ఎగుమతి చేయడం సులభం అవుతుందని ఈ సంస్థ ఫౌండర్​ అరుణ్​ అవతాడే అన్నారు.  ప్రభుత్వం ఎగుమతి యంత్రాంగాన్ని సులభతరం చేస్తే, మల్చింగ్ ఫిల్మ్ మార్కెట్‌‌‌‌కు భారతదేశం భారీ తయారీ కేంద్రంగా మారవచ్చని చెప్పారు. 53 మందికి ప్రత్యక్షంగా,  200 మందికి పైగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థ  2022–-23లో రూ. 34 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. 

రాయితీలు ఇస్తే సత్తా చాటుతాం

లాభదాయకతను పెంపొందించడమే కాకుండా, లాభంలో కొంత భాగాన్ని రైతులకు అందజేయడానికి మరిన్ని ప్రభుత్వ రాయితీలు అవసరమని ఔరంగాబాద్‌‌‌‌కు చెందిన నియో ఫార్మ్‌‌‌‌టెక్ ఫౌండర్​ యోగేష్ గవాండే చెప్పారు. 2017లో ఏర్పాటైన నియో ఫార్మ్‌‌‌‌టెక్, రకరకాల వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేస్తోంది. ప్రభుత్వం రాయితీలతో సాయం చేస్తే జాతీయ,  బహుళజాతి కంపెనీలతో పోటీ పడవచ్చని,  లాభాలను తగ్గించి రైతులకు మేలు చేయవచ్చని గవాండే చెప్పారు. 

నియో ఫార్మ్‌‌‌‌టెక్ దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 12వేల మంది రైతులకు స్ప్రే పంపులను సరఫరా చేసిందని, తమకు ఇంటర్నేషనల్​సప్లై, సేల్స్​చెయిన్​తో సంబంధాలు కావాలని అన్నారు. భారతీయ యువ శక్తి ట్రస్ట్  మేనేజింగ్ (బీవైఎస్) ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ వ్యవస్థల ఆధునీకరణను ప్రోత్సహిస్తోందని చెప్పారు. "ఏఏఎఫ్​ కింద వ్యవసాయం,  అనుబంధ రంగాలలోని వ్యాపారవేత్తలకు స్టార్టప్‌‌‌‌లను స్థాపించడానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. 

 ప్రీసీడ్ ​స్టేజీలో రూ. 5 లక్షలు, సీడ్​ స్టేజీలో రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మిలియన్ల కొద్దీ స్టార్టప్‌‌‌‌లు పని చేస్తున్నాయి.  యునికార్న్‌‌‌‌గా మారగల సామర్థ్యం వాటికి ఉంది” అని ఆమె చెప్పారు. బీవైఎస్టీ మూడు దశాబ్దాలుగా దేశంలోని గ్రామీణ  పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుపేద పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తోంది. నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ (ఎన్‌‌‌‌డీటీఎస్‌‌‌‌సీ)పైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్టార్టప్​లు కోరుతున్నాయి. "కేంద్రం కొత్త  ఇన్నోవేషన్లకు దిశానిర్దేశం చేసేందుకు,  ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ఎన్​డీటీఎస్​పీని ప్రకటించారు. స్టార్టప్‌‌‌‌లకు, ప్రత్యేకించి అగ్రి విభాగంలో పని చేసే వారికి మరిన్ని ప్రయోజనాలు దక్కే ఇన్నోవేషన్లు, రీసెర్చ్​లు అవసరం" అని గవాండే చెప్పారు.