పారిస్ ఒలింపిక్స్ లో భారత్ నేడు రెండు విభాగాల్లో కీలక మ్యాచ్ లు ఆడనుంది. స్వర్ణం కోసం జావెలిన్‌లో నీరజ్ చోప్రా తలపడుతుంటే.. హాకీలో మన జట్టు కాంస్య పతకం కోసం స్పెయిన్ తో తలపడుతుంది. ఈ రెండు పతకాలపై భారత్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. 2021 టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకుంటే.. నీరజ్ చోప్రా భారత్ కు గోల్డ్ అందించాడు. దీంతో ఈ సారి కూడా ఈ ఫీట్ రిపీట్ చేయాలని యావత్ దేశం కోరుకుంటుంది.
టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈసారి నీరజ్‌కు మాత్రం కఠిన పరీక్ష ఎదురుకానుంది. టోక్యోలో ఆరుగురు అటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్ (84 మీటర్లు) అందుకుంటే ఈసారి ఆ సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఐదుగురు ఫస్ట్ త్రోలోనే ఈ మార్క్‌ను అందుకున్నారు. ఇప్పుడు వీళ్ల నుంచే నీరజ్‌కు ముప్పు పొంచి ఉంది. మునుపటితో పోలిస్తే ఈసారి ఫైనల్ భిన్నంగా ఉంటుందని నీరజ్ కూడా వ్యాఖ్యానించాడు.
ఒకవేళ ఫైనల్లో నీరజ్ గోల్డ్ నెగ్గితే కొత్త చరిత్ర సృష్టిస్తాడు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ పారిస్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్‌లో జరుగుతుంది. జావెలిన్ త్రో ఫైనల్ రాత్రి 11:55 నిమిషాలకు ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ 18 1 SD, స్పోర్ట్స్ 18 1 HD టీవీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
భారీ ఆశలతో బరిలోకి దిగి సెమీస్‌లో అనూహ్యంగా తడబడిన ఇండియా హాకీ జట్టు ఇప్పుడు కాంస్య పతకాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టింది. గురువారం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో స్పెయిన్‌ను ఓడించేందుకు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రెడీ అయింది. ఈ మ్యాచ్ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ టీవీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డీడీ స్పోర్ట్స్.. జియో సినిమాలోను ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు.