నీట్ - 2021 ఫలితాలు విడుదల

నీట్ - 2021 ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ: నీట్ - యూజీ 2021 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు నీట్ ఫలితాల వెల్లడికి గురువారమే అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఫలితాల వెల్లడికి ఆటంకాలన్నీ తొలగిపోయి నాలుగురోజులైనా వెల్లడించకపోవడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పలురకాల కామెంట్లతో విరుచుకుపడుతున్న నేపధ్యంలో సోమవారం రాత్రి ఎట్టకేలకు ఎన్టీఏ అధికారులు ఫలితాలు విడుదల చేశారు. 
గత సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాల విడుదలలో ఎడతెగని జాప్యం జరిగింది. ముంబయిలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు తారుమారు కావడంతో మళ్లీ పరీక్ష నిర్వహించాలని బాంబే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీని వల్ల ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును ఎన్టీఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. కేవలం ఇద్దరు విద్యార్థుల కోసం 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఉద్దశించిన ఫలితాలు ఆపలేమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించి... ఇద్దరు విద్యార్థుల ఫలితాల గురించి దీపావళి సెలవుల అనంతరం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎట్టకేలకు అధికారులు కొద్దిసేపటి క్రితం ఫలితాలు విడుదల చేశారు. 
ఫలితాలను వెబ్ సైట్:   http://neet.nta.nic.in/  లో చూడొచ్చు.