తునికాకు బోనస్​ వేస్తలే..     ఫారెస్ట్ ​ఆఫీసర్ల నిర్లక్ష్యం

తునికాకు బోనస్​ వేస్తలే..     ఫారెస్ట్ ​ఆఫీసర్ల నిర్లక్ష్యం

 

  •     నెరవేరని అటవీశాఖ మంత్రి అల్లోల మాట

  •     కార్మికుల ఖాతాల్లోకి చేరని డబ్బు గతేడాది కోత పైసలూ ఇవ్వలేదు

  •     ఫారెస్ట్ ​ఆఫీసర్ల నిర్లక్ష్యం

  •     మన్యం కార్మికుల ఆశలపై నీళ్లు


భద్రాచలం,వెలుగు: ‘తునికాకు సేకరించిన కార్మికులకు బోనస్​ను 2016 నుంచి 2021 వరకు ఇస్తున్నం. వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్తయి. దళారుల ప్రమేయం లేకుండా, ఎవరికీ పైసా ఇవ్వకుండానే నేరుగా మీకు ఇస్తున్నం’.. అంటూ ఈనెల10న రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో నిర్వహించిన సభలో చెప్పారు. సభలో 50 మందికి తునికాకు బోనస్ చెక్కులు కూడా అందించారు. ఇది జరిగి ఇరవై రోజులకు దగ్గరపడుతోంది. కానీ ఇప్పటికీ తునికాకు బోనస్ ఇంకా కార్మికుల ఖాతాల్లో జమ కాలేదు. ఆరేళ్ల బోనస్ డబ్బులు విడుదల కావడంతో గిరిజనులు ఖుషీ అయ్యారు. కానీ అటవీశాఖ నిర్లక్ష్యం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని 1,25,321 మంది తునికాకు కార్మికులకు రూ.80.73 కోట్లు విడుదలయ్యాయి. అవి అటవీశాఖ వద్దనే మూలుగుతున్నాయి. ఇంతవరకు కార్మికుల ఖాతాలకు చేరలేదు. ఏళ్లుగా పోరాటం చేసి సాధించుకున్న బోనస్ తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశించామని, కానీ ఆఫీసర్ల నిర్లక్ష్యం అంధకారంలోకి నెట్టేస్తోందని కార్మికులు వాపోతున్నారు. 
 

సేకరణ డబ్బులకే దిక్కులేదు..

తునికాకు కార్మికుల బాధలు అంతా ఇంతా కావు. బోనస్ డబ్బులు పక్కన పెడితే గతేడాది తునికాకు కోసిన డబ్బులే ఇంతవరకు వారి ఖాతాల్లో జమకాలేదు. ఒకప్పుడు తునికాకు పండుగ అనేవారని, ఇప్పుడు అది దండగలా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన 25 మంది కార్మికుల తునికాకు సేకరణ డబ్బులు నేటికీ ఇవ్వలేదు. దీంతో వారు ఈ ఏడాది తునికాకు సేకరించడం మానేసి ఊళ్లో జరిగే ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఇదే విషయంపై కార్మికులను అడిగితే ‘డబ్బులు రానప్పుడు అడవికి పోయి ఎందుకు తేవాలే?’ అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక్క రామచంద్రునిపేటలోని పరిస్థితే కాదు, జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో చాలా మంది కార్మికులకు సేకరణ డబ్బులు పడలేదు. బ్యాంకు ఖాతాల్లో టెక్నికల్ ప్రాబ్లంతోనే పడలేదని అటవీశాఖ ఆఫీసర్లు అంటున్నారు. వాటిని సరిచేసి ఇవ్వాల్సిన బాధ్యత వారిదే. కానీ వారు పట్టించుకోకపోవడంతో కార్మికులు ఇబ్బందులు 
పడుతున్నారు. 

బోనస్ కోసం వివరాలు అందించాం..

తునికాకు బోనస్ కార్మికుల బ్యాంకు ఖాతాల్లోనే పడుతుంది. వారి వివరాలు మొత్తం బ్యాంకు అకౌంట్​నెంబర్లు, పేర్లు అందించాం. కూలి డబ్బులు కూడా వారి బ్యాంకు ఖాతాలకే వస్తాయి. అవి ఇప్పటికే పడి ఉంటాయి. ఉపాధి కూలికి, పెన్షన్​కు, వడ్ల డబ్బులకు అన్నింటికీ ఒకే అకౌంట్​కావడంతో పడిన విషయం వారికి తెలియడం లేదు. మా దృష్టికి కూడా చాలా మంది తెచ్చారు. పరిశీలిస్తున్నాం.
- కనకమ్మ, రేంజర్, దుమ్ముగూడెం

మా కష్టార్జితం ఇయ్యట్లే..

పోయిన యాడాది తునికాకు కోసినం. ముసలోళ్లు, ముతకోళ్లు ఇంటి ఖర్చులకు వస్తయని అడవికి పోయి తునికాకు తెచ్చి అమ్మితే ఇప్పటికీ పైసా ఇవ్వలే. ఒక్కొక్కరికి రూ.2 నుంచి 3వేల వరకు వస్తయి. బోనస్​అయితే ఎప్పుడు వస్తదో తెలువదు. బ్యాంకుల చుట్టూ తిరగడానికే పైసలు ఖర్చు అవుతున్నాయి. అందుకే ఉపాధి పనులకు పోతున్నం. 
- కల్లూరి గంగరాజు, రామచంద్రునిపేట