ఆర్టీసీ నిపుణుల కమిటి ఎటుపాయె.?

ఆర్టీసీ నిపుణుల కమిటి ఎటుపాయె.?

హైదరాబాద్, వెలుగుఆర్టీసీని నష్టాల బారి నుంచి కాపాడే సలహాలు, సూచనల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పత్తా లేకుండా పోయింది. ఏర్పాటైన మొదట్లో యాక్టివ్‌‌‌‌గా పనిచేసినా కొంతకాలంగా కానరాకుండా పోయింది. అసలీ కమిటీ 2018 నవంబర్​లోనే నివేదిక విడుదల చేయాల్సి ఉన్నా ఏదో ఓ కారణంతో ముందుకు పడటం లేదు. నివేదిక వస్తే.. ఆర్టీసీని గాడిన పెట్టేందుకు చర్యలేమైనా తీసుకుంటారేమోనని కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

12 మందితో కమిటీ

భారీగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు తొమ్మిది మందితో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా నాగరాజుయాదవ్ (బీఎంటీసీ మాజీ చైర్మన్), హన్మంతరావు (పుణె సీఐఆర్టీ రిటైర్డ్ ఫ్యాకల్టీ), పీఎస్ ఆనంద్‌‌‌‌రావు (ఏఎస్‌‌‌‌ఆర్టీయూ, కేఎస్‌‌‌‌ఆర్టీసీ మాజీ ఈడీ), ఆంథోనికుమార్ (కన్సల్టెంట్), ప్రొఫెసర్ వి. శ్రీనివాస్‌‌‌‌చారి (సెంటర్ డైరెక్టర్, అస్కీ), డి.వేణు (టీఎస్‌‌‌‌ఆర్టీసీ రిటైర్డ్ ఈడీ), సుదర్శన్ పదం (అస్కీ)తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. వారంతా పలుసార్లు సమావేశమై చర్చించారు. యూనియన్ల నేతలు, కార్మికులను కలిసి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఆర్టీసీ బస్టాండ్లను పరిశీలించారు, ప్రయాణికులతో మాట్లాడారు. సంస్థకు చెందిన స్థలాలు, భూములు, భవనాలనూ పరిశీలించారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు నిపుణుల కమిటీకి సరిగా సహకరించలేదన్న ఆరోపణలున్నాయి.

పట్టించుకునే వారేరీ?

ఆర్టీసీ నష్టాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నా పట్టించుకునే వారే కరువైన పరిస్థితి కనిపిస్తోంది. రవాణా శాఖ మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నా వరుసగా ఎలక్షన్లతో ఆ పనుల్లోనే మునిగిపోయారు. సోమారపు సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్‌‌‌‌ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. సంస్థకు ఎండీ లేరు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రెటరీ సునీల్‌‌‌‌ శర్మనే ఇన్‌‌‌‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి రెండు మినహా అన్ని విభాగాల్లో ఇన్‌‌‌‌చార్జి ఈడీలే ఉన్నారు. దీంతో మొత్తంగా ఆర్టీసీని పట్టించుకునే వారే లేకుండా పోయారన్న విమర్శలు వస్తున్నాయి. నిపుణుల కమిటీ వేసిన మొదట్లో ఈ పోస్టుల్లో అధికారులు ఉండటంతో పని వేగంగా ముందుకు సాగింది. తర్వాత పోస్టులన్నీ ఖాళీ అవడంతో నిపుణుల కమిటీని కూడా పట్టించుకునేవారు లేకుండా పోయారు. అయితే పదిహేను రోజుల క్రితం నిపుణుల కమిటీలోని పలువురు సభ్యులు సమావేశమై, నివేదికను సిద్ధం చేశారని తెలిసింది. కానీ తర్వాత ఎలాంటి ముందడుగు పడలేదు. ఎలక్షన్లన్నీ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడైనా ప్రభుత్వం, మంత్రి దృష్టి పెట్టాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు.