నైబర్స్​ ఎన్వీ ఓనర్స్​ ప్రైడ్​ 

నైబర్స్​ ఎన్వీ ఓనర్స్​ ప్రైడ్​ 

శని, ఆదివారాల్లో పక్కింటికి వెళ్లి టీవీ చూసిన జ్ఞాపకాలు 80, 90ల్లో పుట్టిన పిల్లల్లో దాదాపు అందరికీ ఉంటాయి. అలాంటివాళ్లలో ఫ్యామిలీ కోసం ‘ఒనీడా’ టీవీ కొనాలి అనే కోరిక ఉండేది. దానికి కారణం.. వాళ్లు టీవీల్లో చూసిన ఒనీడా టీవీ డెవిల్ అడ్వర్టైజ్​మెంట్​​. ఒనీడా యాడ్స్​ పిల్లల మీదే కాదు పెద్దల మీద కూడా చాలా ఇంపాక్ట్​ చూపించాయి అప్పట్లో. అందుకే ఆ కంపెనీ బ్రాండ్స్​ ఇండియన్స్​కు చేరువయ్యాయి. విదేశీ​ కంపెనీల పోటీని తట్టుకుని మరీ అందనంత ఎత్తుకు ఎదిగిన 
బ్రాండ్​ ఇది. 


ఒకప్పుడు టీవీ అంటే.. బాగా డబ్బున్నోళ్ల ఇంట్లో ఉండే లగ్జరీ ఎలక్ట్రానిక్​ గాడ్జెట్. తర్వాత అప్పర్​ మిడిల్​ క్లాస్​ ఇండ్లలోకి కూడా చేరాయి. అదే టైంలో మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది ఇండియన్​ కంపెనీ ఒనీడా(మిర్క్​ ఎలక్ట్రానిక్స్​). అప్పట్లో ఒనీడా టీవీకి స్పెషల్​ క్రేజ్​ ఉండేది. రకరకాల స్ట్రాటజీలతో యాడ్స్​ చేసి సేల్స్​ విపరీతంగా పెంచుకుంది ఒనీడా కంపెనీ. ‘నైబర్స్​ ఎన్వీ.. ఓనర్స్​ ప్రైడ్’ అనే ట్యాగ్​లైన్​తో కస్టమర్లకు దగ్గరైంది. కొన్నేండ్ల పాటు ఇండియన్​ టీవీ మార్కెట్​లో తన హవా కొనసాగించిన ఈ కంపెనీ మొదలైంది ఇలా.. 


ఆసియా గేమ్స్​కి1982లో ఇండియా ఆతిథ్యం ఇవ్వాలని ఆలోచిస్తున్న టైంలో ప్రతి మేజర్​ సిటీలో ఒక ట్రాన్స్‌‌మిషన్ టవర్ ఉండేది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ టెలివిజన్ దిగుమతులకు ‘ఓకే’ చెప్పారు. దాంతో కొన్ని రోజులపాటు అన్ని నగరాల్లో రోజుకో టవర్‌‌ చొప్పున ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాలకు టెలివిజన్​ సర్వీసులు అందాయి. అలా టీవీలకు డిమాండ్ పెరిగింది. సరిగ్గా అదే టైంలో బిజినెస్​ పెట్టాలనే ఆలోచనతో ఉన్న గులు​ మిర్చందానీ, విజయ్ మన్సుఖానీలకు చక్కని అవకాశం దొరికినట్టు అయ్యింది. ఇంజనీరింగ్‌‌ చదువుతున్నప్పటి నుంచి బిజినెస్​ ఛాన్స్​ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్​. కానీ.. అతనికి సరైన అవకాశం దొరకలేదు. ఆసియా గేమ్స్​ ఆ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. దాంతో 1981 జులైలో కంపెనీ మొదలుపెట్టారు. 


ఇంజనీరింగ్​ చదివి.. 


ఒనీడా కంపెనీ పెట్టడంలో కీరోల్​ విజయ్ మన్సుఖానీదే. ఆయనది ముంబై. అక్కడే మెరైన్ ఇంజనీరింగ్  చదివాడు. ఆ తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​సీఐ)లో చేరాడు. తర్వాత ఉద్యోగ అవకాశాలు రావడంతో ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆ తర్వాత1970వ దశకంలో విజయ్  ఇరానియన్​ మర్చంట్ నేవీలో మెరైన్ ఇంజనీర్‌‌గా పనిచేశాడు. సంపాదన కూడా బాగానే ఉండేది. అప్పటికి మర్చంట్ నేవీ రంగంలో ఉన్న ఇండియన్స్​ అందరికంటే విజయ్​ జీతం ఎక్కువగా ఉండేది. కానీ.. ఆయనకు ఉద్యోగం కంటే బిజినెస్​ చేయడమంటేనే ఇష్టం. విజయ్​ ఇరాన్​లో పనిచేస్తున్నప్పుడే మిర్చందానీని కలిశాడు. అతను బిట్స్ పిలానీలో చదివిన ఇంజనీర్. కానీ.. కంపెనీ పెట్టడానికి ముందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత విజయ్​ ఉద్యోగానికి ‘గుడ్​బై’ చెప్పి కంపెనీ పెట్టేందుకు రెడీ అయ్యాడు. బాగా జీతం వచ్చే ఉద్యోగం వదులుకున్నందుకు అందరూ అతని నిర్ణయాన్ని తప్పుబట్టారు. కానీ.. అప్పుడాయన ఉద్యోగం వదులుకోకపోతే.. ఇప్పుడు ఒనీడా కంపెనీయే ఉండేది కాదు. ఆయన గురించి ఇండియాకు తెలిసేది కూడా కాదు.  


కంపెనీ జర్నీ.. 


టీవీలను తయారుచేసే కంపెనీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చేనాటికి కనీసం బ్యాంక్ నుంచి అప్పు ఎలా తీసుకోవాలో కూడా తెలియదు వాళ్లకు. అందుకే అప్పటివరకు సేవ్​ చేసుకున్న డబ్బుతోపాటు, కొంతమంది ప్రైవేట్ ఫైనాన్సర్ల నుండి కొంత అప్పు తీసుకుని కంపెనీ ప్రారంభించారు. ఆర్థిక ఒడిదొడుకులను ఎదిరించి మరీ పట్టుదలతో కంపెనీ పెట్టారు. కానీ.. అప్పటికే మార్కెట్​లో ఉన్న విదేశీ కంపెనీల నుండి గట్టి పోటీ ఎదురైంది. ఆ పోటీని తట్టుకుని మరీ ఒనీడా విజయం సాధించింది. లక్షలాది మంది భారతీయులు మొదటి టీవీగా ఒనీడా కంపెనీవే కొనుక్కునేవారు. 


దిగుమతుల నుంచి...


కంపెనీ పెట్టినా.. వాళ్ల దగ్గర టీవీ తయారుచేయడానికి కావాల్సినన్ని సౌకర్యాలు లేవు. టైం అంతకన్నా లేదు. అందుకే.. ముందుగా సోనీ కంపెనీ నుంచి దిగుమతి​ చేసుకున్నారు. ఆసియా గేమ్స్​ ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం​ ఇండియాలో తయారీ పరిశ్రమ డెవలప్​ చేయాలనే ఉద్దేశంతో దిగుమతుల​ మీద కొన్ని ఆంక్షలు పెట్టింది. దాంతో.. గులు​ మిర్చందానీ, విజయ్ మన్సుఖానీలు ఒక ప్లాన్​ వేశారు. అదేంటంటే.. సోనీ టీవీని ఐదు పార్ట్స్​గా డివైడ్​ చేసి, దిగుమతి చేసుకోవడం. సెమీ నాక్-డౌన్ (అసెంబుల్ చేయని కిట్) రూపంలో తీసుకొచ్చి, వాటిని టీవీలాగా అసెంబుల్​ చేసి ఇండియాలో అమ్మడం. కానీ.. గవర్నమెంట్ అలా దిగుమతి​ చేసుకునేందుకు కూడా ఒప్పుకోలేదు. కంప్లీట్​ నాక్-డౌన్ రూపంలో తెచ్చుకోవాలని చెప్పింది. దాంతో... ఇక లాభం లేదు. దేశీయంగా ప్రొడక్షన్​ మొదలుపెట్టాలి అని డిసైడ్​ అయ్యారు. జపనీస్ బేస్​డ్​ కంపెనీ ప్రీమియం ఎలక్ట్రానిక్స్ కంపెనీ జేవీసీ సాయం తీసుకున్నారు. ఆ రోజుల్లో జపాన్ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఉండేది. అందువల్ల మంచి క్వాలిటీతో టీవీలను ప్రొడ్యూస్​ చేయగలిగారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కొత్త స్ట్రాటజీలతో సేల్స్​ పెంచుకోలిగారు.  

 


కొత్త టెక్నాలజీ


ఒనీడా తన జర్నీలో ఎన్నో మైలురాళ్లను దాటింది. దాదాపు మూడు దశాబ్దాలు మార్కెట్​లో మంచి పొజిషన్​లో ఉంది. దానికి కారణం.. ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా.. కంపెనీ దానిమీద రీసెర్చ్​ చేస్తుంది. అప్పట్లో దాదాపు అన్ని బ్రాండ్ల టీవీలు10 నుంచి 15 ఛానెల్స్​ మాత్రమే ట్యూన్​ చేసేవి. కానీ.. ఒనీడా మాత్రం 60 కంటే ఎక్కువ ఛానెల్స్​ని ట్యూన్​ చేసేది. అందుకోసం ప్రత్యేకంగా టామ్-–టోమింగ్ అనే టెక్నాలజీని వాడారు. అలా టీవీలతో మొదలైన ఒనీడా బిజినెస్​ జర్నీ... ఆ తర్వాత ఏసీ, వాషింగ్​ మెషిన్​, మైక్రో ఒవెన్​ లాంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. మొదట కంపెనీ పెట్టినప్పుడు కేవలం ముంబైలోనే ఒక అసెంబ్లింగ్​ యూనిట్​ ఉండేది. కానీ... ఇప్పుడు ముంబైలోని అంధేరిలో మెయిన్​ ఆఫీస్​తోపాటు వాడా, రూర్కీలో రెండు అత్యాధునిక ప్రొడక్షన్​ యూనిట్లు ఉన్నాయి. వాడాలో ప్యానెల్ టెలివిజన్లు, రూర్కీలో వాషింగ్ మెషిన్లను తయారుచేస్తున్నారు.


మార్కెటింగ్​.. 


ఒనీడా సక్సెస్​కు ప్రొడక్ట్​ క్వాలిటీ ఒక కారణమైతే.. మార్కెటింగ్​ ఎత్తుగడలు మరో కారణమయ్యాయి. దాదాపు70 ఏండ్ల క్రితమే ఇండియాలో అడ్వర్టైజ్​మెంట్స్​తో ప్రొడక్ట్స్​ని ప్రమోట్​ చేయడం మొదలైంది. అప్పటినుంచి ఎన్నో యాడ్స్​ వచ్చాయి. కానీ.. వాటిలో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వాటిని ఎన్నటికీ మర్చిపోలేరు. ఒనీడా కూడా అలాంటి యాడ్స్​నే చేయిస్తుంది. అప్పటివరకు అందరూ అందంగా, ఆహ్లాదకరంగా ఉండే యాడ్స్​ చేయించేవాళ్లు. కానీ.. ఒనీడా కొత్తగా ఆలోచించి యాడ్స్​కు ఉండాల్సిన కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలను మార్చి ‘డెవిల్ యాడ్’​ని​ చేసింది. ఇందులో ఒక దెయ్యం వచ్చి టీవీ గురించి ప్రమోట్​ చేస్తుంది. ఇందులో విట్‌‌బ్రెడ్‌‌ డెవిల్‌‌గా నటించడానికి మూడు నెలలు పట్టింది. మామూలుగా టీవీల్లో కనిపించే దెయ్యాలకు నల్లని బట్టలు ఉంటాయి. కానీ, ఒనీడా డెవిల్ పూర్తిగా ఆకుపచ్చ బట్టలు వేసుకుంటుంది. పదునైన గోర్లు, కొమ్ములు, తోక ఉంటాయి. అప్పట్లో ఈ యాడ్​ చూసిన చిన్నపిల్లలకు భయమేసేది. ఆ తర్వాత వచ్చిన అన్ని ఒనీడా యాడ్స్​ ఈ డెవిల్​ కాన్సెప్ట్​తోనే వస్తున్నాయి.


పెద్ద నెట్​వర్క్​ 


చిన్న అసెంబ్లింగ్​ కంపెనీగా మొదలైన ఒనీడాకు ఇప్పుడు ఇండియా అంతటా మార్కెట్​ఉంది. దాదాపు 4,000 మంది డీలర్లు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఫ్లిప్​కార్ట్, అమెజాన్​, టాటా క్లిక్​ లాంటి ఆన్​లైన్​ షాపింగ్​ సైట్లలో కూడా ఒనీడా ప్రొడక్ట్స్​ అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో 33 బ్రాంచ్ ఆఫీస్​లు ఉన్నాయి. 200కి పైగా కస్టమర్ రిలేషన్ సెంటర్లు ఉన్నాయి. కొన్ని అరబ్ రాష్ట్రాలకు కూడా ఒనీడా ప్రొడక్ట్స్​ ఎగుమతి అవుతున్నాయి. తూర్పు ఆఫ్రికా దేశాలు ఉగాండా, టాంజానియా, కెన్యా, ఇథియోపియాల్లో కూడా ఒనీడా ప్రొడక్ట్స్​ అమ్ముతోంది.