హమాస్ ను అంతం చేసి తీరుతాం: నెతన్యాహు

హమాస్ ను అంతం చేసి తీరుతాం: నెతన్యాహు
  • అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా.. దాడులు చేస్తం
  • ఎంతో బాధతో చెప్తున్న.. ప్రతీకారం తీర్చుకుంటాం
  • యుద్ధం కంటే ఏదీ ముఖ్యం కాదని వెల్లడి

టెల్​అవీవ్: హమాస్​ మిలిటెంట్ సంస్థపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు గురువారం స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అమలు చేయాలని అంతర్జాతీయంగా ప్రెజర్ వస్తున్నా.. గాజాలో తమ సైన్యం పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. విజయం సాధించే దాకా పోరాడతామన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు కచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎంతో బాధతో చెప్తున్న.. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా.. గాజాపై దాడులు మాత్రం ఆపేది లేదు. ఏ దేశం, ఏ ఆర్గనైజేషన్ విజ్ఞప్తులను మేం పరిగణనలోకి తీసుకోం. చివరి దాకా పోరాడుతాం.. కచ్చితంగా విజయం సాధిస్తాం. యుద్ధం కంటే మాకు ఏం ఎక్కువ కాదు”అని నెతన్యాహు తెలిపారు. గాజాలో మానవ సంక్షోభం, కాల్పుల విరమణ, బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మంగళవారం నాన్​ బైండింగ్ తీర్మానం చేసింది. దీనిని ఆమోదించిన తర్వాత నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి తమ సైన్యం అత్యంత ఘోరమైన దాడులను ఎదుర్కొంటున్నదని ఆయన తెలిపారు. తాజాగా హమాస్ మెరుపు దాడిలో తొమ్మిది మంది సైనికులు చనిపోయారన్నారు.

ప్రపంచం ఎదురుచూస్తోంది..

హమాస్​ను భూస్థాపితం చేయడంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని బెంజిమెన్ నెతన్యాహు అన్నారు. ప్రపంచ దేశాలకు కూడా ఊరట లభిస్తుందని తెలిపారు. ఎవరు గెలుస్తారో చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) నార్త్, సౌత్ గాజాలోకి దూసుకెళ్తున్నదని చెప్పారు. దీంతో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య భీకర పోరు కొనసాగుతున్నదన్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో 10 మంది సైనికులు చనిపోయినట్లు ఐడీఎఫ్ గురువారం ప్రకటించింది. అక్టోబర్ 31న 15 మంది సైనికులు చనిపోయిన తర్వాత ఇదే అత్యధిక ప్రాణ నష్టమని తెలిపింది. ఈ వారంలో అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా పౌరుల మరణాలపై చర్చించే చాన్స్ ఉందని వైట్​హౌస్ అధికారులు ప్రకటించారు. బుధవారం సౌదీ యువ రాజు మహ్మద్ బిన్ సల్మాన్​తో జేక్ సలివన్ భేటీ అయ్యారు. గాజాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.

డంబ్ బాంబులతోనే భారీ ప్రాణ నష్టం

హమాస్​పై ఇజ్రాయెల్ భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నది. పాలస్తీనా మృతుల సంఖ్య భారీగా పెరగడానికి కారణం ‘డంబ్ బాంబులు’ అని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గాజాలో భారీ విధ్వంసానికి కారణం కచ్చితమైన టార్గెట్ లేని బాంబులే (డంబ్ బాంబులు) అని తన నివేదికలో వివరించాయి. ఇజ్రాయెల్ ఇప్పటివరకు యుద్ధంలో మొత్తం 29,000 బాంబులు వాడిందని, అందులో 40 నుంచి 45 శాతం డంబ్ బాంబులే అని వెల్లడించాయి.