కెపాసిటీకి మించి నీటి విడుదలతో తెగిన నెట్టెంపాడు కెనాల్

కెపాసిటీకి మించి నీటి విడుదలతో తెగిన నెట్టెంపాడు కెనాల్

గద్వాల, వెలుగు: నెట్టెంపాడు కెనాల్స్​కు కెపాసిటీకి మించి నీటిని విడుదల చేయడంతో నీటి ప్రవాహం ఎక్కువై తెగిపోతున్నాయి. ఆదివారం ఉదయం నెట్టెంపాడు లిఫ్ట్ లోని 101వ ప్యాకేజీ కెనాల్​ గట్టు మండలం బలిగెర సమీపంలో తెగిపోయింది. దీంతో సాగు నీరంతా వృథాగా వెళ్లిపోతోంది. సాగునీటిని కెనాల్స్​ కెపాసిటీని బట్టి ఆఫీసర్లు, లస్కర్లు విడుదల చేస్తుంటారు.

అయితే నెట్టెంపాడు లిఫ్ట్ లోని 101వ ప్యాకేజీలోని డీ6 కాల్వకు శనివారం రాత్రి రైతులే నీటిని విడుదల చేసుకోవడంతో కెనాల్​ తెగిపోయిందని ర్యాలంపాడు రిజర్వాయర్  ఇన్ చార్జి ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. నీటి ప్రభావం తగ్గిన వెంటనే రిపేర్లు చేస్తామని చెప్పారు. వచ్చే యాసంగి పంటకు ర్యాలంపాడు రిజర్వాయర్  కింద క్రాప్  హాలిడే ప్రకటించారు.

ఇప్పుడు కాల్వ తెగిపోవడంతో ఉన్న పంటలను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు తెగిన కాలువను పరిశీలించారు. రైతులు నీటిని విడుదల చేసుకుంటుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, బలిగెర శివారెడ్డి ప్రశ్నించారు. వెంటనే కాల్వకు రిపేర్లు చేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్  చేశారు.