40 డిగ్రీల ఎండలో తిరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? నరాల డాక్టర్ చెప్పింది ఇదే !

40 డిగ్రీల ఎండలో తిరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? నరాల డాక్టర్ చెప్పింది ఇదే !

దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 44–45 డిగ్రీలు దాటుతోంది ఉష్ణోగ్రత. ఉదయం 11 నుంచి 4 గంటల వరకు బయటకు రాకపోవటమే మంచిదని వాతావరణ కేంద్రం హెచ్చరించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత విపరీతమైన ఎండలకు తిరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందని డాక్టర్లు అంటున్నారు. ఎండకు, బ్రెయిన్ స్ట్రోక్ కు కనెక్షన్ ఏంటో చెప్పారు. దాని గురించి తెలుసుకుందాం. 

స్ట్రోక్ హైబీపీ వల్ల కాదు..

మెదడుకు, హీట్ వేవ్ కు మధ్య ఉన్న సంబంధమేంటో.. ఎలాంటి ప్రభావం చూపుతుందో కిమ్స్ హాస్పిటల్, బెంగళూరు, నరాల డాక్టర్ కుమార్ వివరించారు. సమ్మర్ లో బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ అవుతున్నాయని.. అయితే అందరు అనుకుంటున్నట్లు ఇది అధిక రక్తపోటు, డయాబెటిస్ వలన కాదని అంటున్నారు. అధిక వేడిమి, డీహైడ్రేషన్ (రక్తంలో నీటి శాతం తగ్గిపోవడం) కారణంగా రక్త నళాలపై ఒత్తిడి పెరిగి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. 

కారణం ఇదే:

ప్రతీ ఏటా ఇండియాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ఎండకు బాడీలో ఉన్న నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఎంత నీరు బయటకు వెళ్తుందో అంత నీటిని శరీరానికి అందించాల్సి ఉంటుంది. లేదంటే డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. నీరు తగ్గిపోవడంతో రక్తం చిక్కగా మారుతుంది. ఈ కారణంగా రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది. 

►ALSO READ | అద్భుతమైన రాధానగర్ బీచ్ !.. ఆసియాలోనే స్వర్గం లాంటి ఈ బెస్ట్ బీచ్ ఎక్కడ ఉందొ తెలుసా...

రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు.. ఊపిరి తిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకుని వస్తున్న ఫ్రెష్ బ్లడ్ ప్రవాహాన్ని ఈ రక్తం గడ్డలు అడ్డుకుంటాయి. దీంతో మెదడులో రక్తం బ్లాక్ అయిపోతుంది. ఈ కారణంగా ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.. అని చెప్పారు. 

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు లక్షణాలు:

  • శరీరంలో ఏదో ఒక వైపు మొద్దుబారినట్లు ఉండటం
  • వీక్ నెస్ అంటే శక్తి లేకపోవటం
  • మాట్లాడటానికి ఇబ్బంది కలగటం లేదా సరిగా మాట్లాడలేకపోవటం
  • తీవ్ర స్థాయిలో తలనొప్పి
  • ఉన్నట్లుండి సరిగ్గా చూడలేకపోవడం
  • నిలబడి ఉన్నా కూర్చుని ఉన్నా బ్యాలెన్స్ తప్పిపోవడం.. అంటే ఒక రకంగా కళ్లు, తల తిరగటం.

ఎలా బయటపడాలి:

ఎండలకు బ్రెయన్ స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని కచ్చితమైన అలవాట్లను చేసుకోవాలని అంటున్నారు డాక్టర్లు.

  • ఎక్కువగా నీళ్లు తాగటం
  • దాహం లేదు అనేంత తరకు నీళ్లు తాగటం
  • కాఫీ లాంటి డ్రింక్స్ ఎక్కువగా తాగకపోడం
  • కూల్ డ్రింక్స్ లేదా ఆల్కహాల్ తీసుకోకపోవడం
  • మధ్యాహ్నం సమయంలో ఎండకు వెళ్లకపోవడం
  • లైట్ కలర్ బట్టలు వేసుకోవడం
  • ఎక్కువ చెమట వచ్చినపుడు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం.