
అప్పుడప్పుడు తలనొప్పి రావడం సహజం. కానీ, కొందరికి తలనొప్పి వెంటే ఉంటుంది.అది కూడా ఒక వైపే వస్తుంది. ఇలా వెంటాడే తలనొప్పిని మైగ్రేన్ అంటారు. మరీ ఇంతగా ఇబ్బంది పెట్టే ఈ తలనొప్పిని గుర్తించి, ఎలా తగ్గించుకోవాలో న్యూరాలజిస్ట్ డాక్టర్ మౌనిక వివరించారు.
మామూలుగా తలనొప్పి వస్తే కాసేపు ఉంటుంది. కానీ, మైగ్రేన్ వస్తే మాత్రం ఎంతసేపటికీ తగ్గదు. తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శారీరకమైన ఇబ్బందే కాకుండా మానసికంగా కూడా ఆ ప్రభావం పడుతుంది. కోపం, చిరాకు ఉంటాయి. వాటిని అదుపు చేసుకోలేకపోవడం వల్ల కొన్నిసార్లు ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. మైగ్రేన్ ఉంటే ఒకవైపు మొత్తం లాగేస్తుంటుంది. అందుకే తలనొప్పి వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లాలి. అది మామూలు తలనొప్పా? పార్శ్వపు నొప్పా? అనేది తెలుసుకోవాలి.
మైగ్రేన్ అంటే పార్శ్వపు తలనొప్పి. ఇది సెన్సరీ నెర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఈ తలనొప్పి ఎక్కువగా ఆడవాళ్లలో కనిపిస్తుంది. అది కూడా యూత్, మిడిల్ ఏజ్ వాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే... ఆడవాళ్లలో విడుదలయ్యే కొన్ని హార్మోన్ల వల్ల రక్త నాళాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. దాంతో ఆడవాళ్లకి ఈ తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎక్కువ టెన్షన్, ఒత్తిడి. ఇవి రెండూ కూడా ఈ నొప్పికి కారణాలు. నరం కొట్టుకున్నట్టు ఒక వైపు మాత్రమే వచ్చే ఈ మైగ్రేన్ నొప్పి నాలుగు నుంచి 72 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. కొందరిలో పల్సటైల్ హెడేక్ కనిపిస్తుంది. అంటే... తలలో నరం టక్ టక్ అని కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇది కూడా మైగ్రేన్‌లో ఒక లక్షణమే. మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు వెలుతురు చూసినా, పెద్ద శబ్దాలు విన్నా, ఘాటు వాసనలు పీల్చినా నొప్పి తీవ్రత పెరుగుతుంది. తినే తిండి వల్ల కూడా నొప్పి పెరిగే అవకాశం ఉంది. కాఫీ, రెడ్ వైన్, షాంపెయిన్ వంటివి తాగితే మైగ్రేన్ తలనొప్పి పెరుగుతుంది. మాన్సూన్ మైగ్రేన్
ఈ సీజన్లో వచ్చే తలనొప్పులను మాన్సూన్ మైగ్రేన్స్ అంటారు. సీజన్‌కి, తలనొప్పికి సంబంధం ఉంటుందా? అట్మాస్ఫియరిక్ ప్రెజర్ (బారోమెట్రిక్ ప్రెజర్)లో అంటే.. వాతావరణంలో మార్పులు ఏర్పడినప్పుడు ఆ ప్రెజర్‌కి సైనస్ లేదా బ్రెయిన్లో ఉండే ప్రెజర్స్కి అంతరాయం ఏర్పడుతుంది. దాంతో ఈ నొప్పి వస్తుంది. కాబట్టి ఈ సీజన్లో మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ జాగ్రత్తలు అవసరం
- కాఫీ, ఆల్కహాల్ వంటి వాటికి ఘాటు వాసనలకు దూరంగా ఉండాలి.
- మైగ్రేన్ వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉన్న చీకటి ప్రదేశంలోకి వెళ్లాలి. లేదంటే డీప్ బ్రీత్ తీసుకోవాలి.
- ఐస్ ప్యాక్, కోల్డ్ కంప్రెషర్స్, మెంతాల్ వంటివి వాడినా నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
- ఆరోగ్యకరమైన నిద్ర తప్పనిసరి. దానివల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది.
- నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పి రాకుండా ఉంటుంది లేదా ఉన్న నొప్పిని తగ్గిస్తుంది కూడా.
- ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేసి ఒత్తిడి తగ్గించుకోవాలి.
మెడికల్ ట్రీట్మెంట్
మామూలుగా ఈ తలనొప్పులకు అనాల్జెసిక్స్ ఇస్తారు. వీటితోపాటు ట్రిప్టాన్స్ అనేవి కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. అలాగే మరికొన్ని రాబోతున్నాయి. అయితే ఈ మందుల్ని నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నవాళ్లకు సజెస్ట్ చేస్తాం. కాకపోతే దీర్ఘకాలికంగా ఈ నొప్పితో బాధపడేవాళ్లకు మాత్రం ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. పేషెంట్ హెల్త్ కండిషన్‌ని చూసి, దాన్ని బట్టి ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ ఒక్కో రకమైన పద్ధతుల్లో ఇస్తాం. ఇందులో భాగంగా ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాక్స్ వంటి రకరకాల డ్రగ్స్ వాడతారు. ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ చేసినా మైగ్రేన్ తలనొప్పి తగ్గకపోతే ఒక ఇంజెక్షన్ చేస్తారు. ఈ ఇంజెక్షన్‌ను నెలకు ఒకసారి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినప్పుడు నరాలు బ్లాక్ అవుతాయి. అప్పుడు టెన్స్ అనేటువంటి ట్రీట్మెంట్స్ చేస్తారు.
డివైజ్లతో తలనొప్పి తగ్గుతుందా?
మైగ్రేన్‌కి కొన్ని టెక్నికల్ డివైజ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ డివైజ్‌లు వాడడం వల్ల మైగ్రేన్ తగ్గే అవకాశం ఉంది. మైగ్రేన్ తగ్గడానికి న్యూరో మాడ్యులేషన్ డివైజెస్ అనేవి కొత్తగా వస్తున్నాయి. వీటిలో నాలుగు రకాలున్నాయి. అవేంటంటే.. ఎక్స్టర్నల్ ట్రై జెమినల్ స్టిమ్యులేషన్. ఇది మైగ్రేన్‌లో ట్రై జెమినల్ స్టిమ్యులేషన్‌ను బయటినుంచి ఇస్తారు. మరొకటి సింగిల్ పల్స్ ట్రాన్స్ప్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇందులో పేషెంట్‌ని బట్టి డోస్‌లు ఇస్తారు. ఇంకోటి నాన్ ఇన్వేసివ్ వేజల్ నర్వ్ స్టిమ్యులేషన్. మైగ్రేన్ అటాక్ వచ్చిన వెంటనే కుడి, ఎడమ రెండు వైపులా దీన్ని రెండు నిమిషాల పాటు ఇస్తారు. చివరిది రిమోట్ ఎలక్ట్రికల్ న్యూరో మాడ్యులేషన్ స్టిమ్యులేషన్. ఈ డివైజ్‌ని మైగ్రేన్ వచ్చిన గంటలోపు చేతి దగ్గర పెట్టి, 45 నిమిషాల వరకు స్టిమ్యులేషన్‌ని పెంచుతూ ఉంటే మైగ్రేన్ తగ్గుతుంది. ఇవి మార్కెట్లో నర్వైవో, గామాకోర్ సఫైర్, రిలీవియాన్ వంటి పేర్లతో అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ రెనోవా హాస్పిటల్స్ హైదరాబాద్