
పిల్లలు తమ జీవితంలో వివిధ దశలను దాటుకుని వస్తారు. కొన్ని సార్లు ఇది కావాలని, కొన్ని సార్లు అది కావాలని అనుకుంటారు. నేను కూడా అంతే. అయితే ఒక్కటి మాత్రం కచ్చితం.. పాలిటిక్స్‌లోకి రావాలని ఎన్నడూ అనుకోలేదు. కనీసం ఆ దిశగా ఆలోచించలేదు కూడా. కానీ ఇప్పుడు అందులో భాగమయ్యాను. ప్రజల కోసం ఎలా పని చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా బెస్ట్ అందించేందుకు ప్రయత్నిస్తా. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత ప్రజలు తమ సహనం, నిగ్రహం, మెచ్యూరిటీ చూపించారు. దేశ ప్రయోజనాల కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని నిరూపించారు. సుప్రీం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో దేశం ఓ కొత్త మార్గంలో కొత్త సంకల్పంతో ముందుకు సాగుతోంది.
న్యూఢిల్లీ:
‘‘పాలిటిక్స్‌లోకి వస్తానని ఎన్నడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు అందులో భాగమయ్యాను. ప్రజల కోసం ఎలా పని చేయాలి అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా బెస్ట్ అందించేందుకు ప్రయత్నిస్తా” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్59వ ఎడిషన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ రేడియో ద్వారా ఎన్‌సీసీ స్టూడెంట్ల గ్రూప్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా తాను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సీసీలో చేరినట్లు ప్రధాని గుర్తుచేసుకున్నారు. ‘పొలిటీషియన్ కాకపోయుంటే.. ఏమయ్యేవారు?’ అని స్టూడెంట్లు ప్రశ్నించగా.. ‘డిఫికల్ట్ క్వశ్చన్’ అంటూ బదులిచ్చారు. ‘‘పిల్లలు తమ జీవితంలో వివిధ దశలను దాటుకుని వస్తారు. కొన్నిసార్లు ఇది కావాలని, కొన్ని సార్లు అది కావాలని అనుకుంటారు. నేను కూడా అంతే. అయితే ఒక్కటి మాత్రం కచ్చితం.. పాలిటిక్స్‌లోకి రావాలని ఎన్నడూ అనుకోలేదు. కనీసం ఆ దిశగా ఆలోచించలేదు కూడా” అని వివరించారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘సినిమాల విషయంలో ఆసక్తి తక్కువ. టీవీలు చూడటం కూడా చాలా తక్కువ. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో గూగుల్ వల్ల చదవలేకపోతున్నా. చదివడం తగ్గిపోతోంది. ఎందుకంటే ఏదైనా రెఫరెన్స్ కావాలంటే.. మనకు వెంటనే షార్ట్‌కట్ దొరికిపోతుంది. గూగుల్ చేస్తా” అని చెప్పారు.
మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దు..
మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే.. ఎంత అభివృద్ధి సాధించినా వృథానే అని ప్రధాని మోడీ అన్నారు. ‘ఓ వ్యక్తి అభివృద్ధికి అతడి భాషా పురోగతే మూలం’ అని ఆధునిక హిందీ భాష పితగా పేరొందిన భారతేందు హరిశ్చంద్ర 150 ఏళ్ల క్రితమే చెప్పారని తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ధార్‌చులాలో ప్రజలు తమ భాష ‘రుంగ్లో’ను కాపాడుకుంటున్నారని చెప్పారు. వాళ్లు 10 వేల మంది కూడా ఉండరని, కానీ తమ భాషను బతికించుకునేందుకు అందరూ నడుంబిగించారని చెప్పారు. మాతృభాషలో పరిజ్ఞానం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఎన్‌సీసీ డే, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే, ఎగ్జామ్ వారియర్స్, ఫిట్ ఇండియా తదితర అంశాల గురించి కూడా మోడీ మాట్లాడారు.