800 మూవీపై వివాదం.. స్పందించిన క్రికెటర్ మురళీధరన్

800 మూవీపై వివాదం.. స్పందించిన క్రికెటర్ మురళీధరన్

చెన్నై: శ్రీలంక లెజెండ్రీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితంపై కోలీవుడ్‌‌‌‌లో ‘800’ అనే మూవీ తెరకెక్కుతోంది. మక్కన్ సెల్వన్‌‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో మురళీధరన్‌‌గా టైటిల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాపై తమిళనాడులో రగడ నడుస్తోంది. శ్రీలంకలో తమిళుల ఊచకోత విషయాన్ని మురళీ బయోపిక్‌‌కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో  పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాదంపై మురళీధరన్ స్పందించాడు. అమాయకుల ప్రాణాలను బలిగొనడానికి తాను ఎన్నడూ మద్దతు ఇవ్వలేదన్నాడు.

అమాయకులను చంపాలని నేను చెప్పలేదు

‘నేను 2009లోనే చెప్పా. యుద్ధం ముగిసిపోవడంతోపాటు ఇరువైపులా ప్రాణనష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అదే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని చెప్పా. ఈ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. ఎప్పుడైతే తమిళులు చనిపోయి అంతమవుతారో అదే నా లైఫ్‌‌లోని సంతోషకరమైన రోజుగా వక్రీకరించారు. అమాయకులను చంపాలని నేనెప్పుడూ చెప్పలేదు. ఇకపై చెప్పబోను కూడా. యుద్ధం మిగిల్చే బాధేంటో నాకు తెలుసు. శ్రీలంకలో వార్ జరుగుతున్న 30 ఏళ్లలోనే నేను పెరిగా. నేను ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు మా నాన్నను నిర్బంధించారు. చాలా రోజులు మేం వీధుల్లోనే గడిపాం’ అని మురళీ పేర్కొన్నాడు.

నటిస్తే తమిళ చరిత్రలో సేతుపతికి నో ప్లేస్

మరోవైపు ప్రముఖ తమిళ డైరెక్టర్ భారతీరాజా లాంటి వాళ్లు మురళీధరన్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళులకు అతడు ద్రోహం చేశాడంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో నటిస్తే తమిళ హిస్టరీలో విజయ్ సేతుపతికి చోటు ఉండదని కొందరు హెచ్చరిస్తున్నారు. ‘లంకలో తమిళులు చనిపోతున్నప్పుడు మురళీధరన్ ఫిడేల్ వాయించాడు. తన సొంత ప్రజలు చనిపోతున్నప్పుడు ఓ స్పోర్ట్స్‌మన్‌‌గా ఎంత సాధించినా ఉపయోగం ఏంటి ? మాకు సంబంధించినంత వరకు ముత్తయ్య నమ్మకద్రోహం చేశాడు’ అని ప్రముఖ తమిళ డైరెక్టర్ భారతీరాజా చెప్పారు. 800 మూవీలో విజయ్ సేతుపతి నటించకపోతే ఆయనకు తమిళుల చరిత్రలో చోటు ఉంటుందని, లేకపోతే ద్రోహుల హిస్టరీలో ఆయనకు ప్లేస్ ఉంటుందని పీఎంకే చీఫ్ పి.రామదాస్ పేర్కొన్నారు.