కరీంనగర్​ ఎంపీ సీటుకు కొత్త బీజేపీ అభ్యర్థి .. తెరపైకి ఉదయనందన్ రెడ్డి పేరు

కరీంనగర్​ ఎంపీ సీటుకు కొత్త బీజేపీ  అభ్యర్థి ..  తెరపైకి ఉదయనందన్ రెడ్డి పేరు

హైదరాబాద్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశమివ్వాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న ఆ పార్టీ జాతీయ నాయకత్వం.. ఎంపీ ఎన్నికల్లో కొత్త వారికి, ముఖ్యంగా న్యూట్రల్ వ్యక్తులను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు పార్టీలో చర్చ నడుస్తున్నది. బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడం, గెలిచిన ఎనిమిది మందిలో రాజాసింగ్ మినహా మిగతా ఏడుగురు కొత్త వారే కావడంతో హైకమాండ్ ఆలోచనలో పడింది. 

ఇదే ప్రయోగాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేస్తే తెలంగాణలో బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయనే భావన జాతీయ నేతల్లో వ్యక్తమవుతోందని రాష్ట్ర బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేత అభిప్రాయపడ్డారు. సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు, సమన్వయ లోపం, గ్రూపులను ప్రోత్సహించడం వంటి కారణాలతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న సీట్లను సాధిం చలేదని సెంట్రల్ పార్టీ గుర్తించింది. అందుకే ఈ ఎన్నికల్లో కొన్నిచోట్ల సీనియర్లకు చెక్ పెట్టడం, లేదంటే వారిని ఇతర చోట్ల నుంచి పోటీ చేయించే ఆలోచనకు జాతీయ నాయకత్వం వచ్చినట్లు సమాచారం.

ఉదయ్​కి కలిసొచ్చిన ఆరెస్సెస్ నేపథ్యం

కరీంనగర్ బీజేపీ ఎంపీ టికెట్ రేసులో పాడి ఉదయనందన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండల కేంద్రానికి చెందిన ఉదయనందన్ రెడ్డిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. సిమెన్స్‌‌‌‌లో చిన్న ఇంజినీర్‌‌‌‌గా జీవితాన్ని మొదలు పెట్టి.. ఉన్నత స్థానానికి ఎదిగాడు. యుప్​టీవీ వ్యవస్థాపకుడిగా మంచి గుర్తింపుపొందారు. చాలా కాలంగా జిల్లాలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలకు సహకరిస్తూ వస్తున్నారు. ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ నేపథ్యం కూడా ఉండడంతో ఆయన్ను ఎన్నికల బరిలో దించే అవకాశం ఉందని పార్టీలో చర్చసాగుతోంది. ఉదయనందన్​రెడ్డికి టికెట్ ఇస్తే కరీంనగర్​లో బీజేపీ గెలుపు ఖాయమని పార్టీనేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో బండి సంజయ్ ని జహీరాబాద్​కు పంపిస్తే.. అక్కడ కూడా ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్​కి ఉన్న మాస్ ఫాలోయింగ్, యూత్​లో ఉన్న క్రేజ్​తో ఇక్కడ ఆయన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని కామారెడ్డి అసెంబ్లీని బీజేపీ గెలుచుకుంది. ఎల్లారెడ్డి, జుక్కల్ లో మంచి ఓట్లను సాధించింది. ఆందోల్, జహీరాబాద్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. నారాయణఖేడ్ కర్నాటకకు సరిహద్దులో ఉండడంతో ఎంపీ ఎన్నికల్లో కలిసోస్తుందని అంటున్నారు. దీంతో ఇటు కరీంనగర్, అటు జహీరాబాద్ రెండు ఎంపీ సీట్లను గెలుచుకునే చాన్స్ ఉంటుందని బీజేపీ ఢిల్లీ పెద్దలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఆదిలాబాద్​లో కూడా సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావును మార్చనున్నారనే ప్రచారం సాగుతోంది. అక్కడ రాథోడ్ బాపూరావు, రమేశ్ రాథోడ్​లలో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. మెదక్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి నియోజకవర్గాల్లో కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్నా.. న్యూట్రల్ అభ్యర్థుల కోసం బీజేపీ వెతుకుతున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

రెడ్డీలు దూరమవుతారని..

బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకరికొకరు ఓడిపోవాలని గోతులు తవ్వుకోవటంతోనే వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా  ఓడిపోయారని  రాష్ట్ర బీజేపీలో చర్చ సాగుతోంది. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్​కి బదులు తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని ఈటల రాజేందర్ ఇప్పటికే హైకమాండ్ ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇక్కడ ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు వారి ఓటమికి ప్రయత్నించే అవకాశం ఉందని గుర్తించిన జాతీయ నాయకత్వం ఈ ఇద్దరికి కాకుండా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న రెడ్డి కులానికి టికెట్ ఇవ్వాలని యోచిస్తోంది. 

కరీంనగర్‌‌‌‌ ఎంపీ స్థానం పరిధిలో ముదిరాజ్ కులం ఓట్లు లక్షా 50 వేలు,  రెడ్డిల ఓట్లు లక్షా 30 వేలు, మున్నూరు కాపు ఓట్లు 90 వేలు ఉన్నాయి. మరోవైపు అక్కడ బీజేపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి కూడా తమ వర్గానికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సంజయ్​కి టికెట్ ఇస్తే రెడ్డీలు బీజేపీకి దూరమవుతారని ఇటీవలే రాష్ట్ర, జాతీయ నాయకత్వాలకు ఫిర్యాదు చేశారు. అందుకే సంజయ్​కి బదులు ఈసారి రెడ్డి అభ్యర్థిని బరిలోకి దింపాలనే సమీకరణాలను పార్టీ పరిశీలిస్తున్నది.