నాలుగు రోజుల్లో టీఎస్​పీఎస్సీకి కొత్త బోర్డు!

నాలుగు రోజుల్లో టీఎస్​పీఎస్సీకి కొత్త బోర్డు!
  • చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి చాన్స్
  • నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం.. రెండ్రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ 
  • గవర్నర్ తమిళిసైతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ
  • రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం 
  • టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంపై చర్చ
  • సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్

హైదరాబాద్, వెలుగు:  మరో నాలుగు రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)కు కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్​రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదం కోసం రెండ్రోజుల కిందటే రాజ్​భవన్​కు పంపించింది. అయితే ఆ టైమ్​లో గవర్నర్​ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. గవర్నర్ బుధవారం హైదరాబాద్​కు రాగా.. ఆమెను రాజ్ భవన్​లో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న పబ్లిక్​ గార్డెన్స్​లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిపబ్లిక్​ డే వేడుకలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియమాకంపై గవర్నర్ తో చర్చించినట్టు తెలిసింది. చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశామని, త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫార్సు చేస్తామని గవర్నర్ తో రేవంత్ రెడ్డి చెప్పారు.

టీఎస్​పీఎస్సీ బోర్డు ఏర్పాటుకు త్వరగా ఆమోదం లభిస్తే, ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదు రుచూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్డ్ ఐపీఎస్​ను చైర్మన్​గా నియమిస్తే టీఎస్​పీఎస్సీ కట్టుదిట్టంగా పని చేస్తుందని, అక్రమాలకు తావుండదని.. అం దులో భాగంగానే సెర్చ్ కమిటీ సూచనల మేరకు మహేందర్ రెడ్డి పేరు సిఫార్సు చేశామని వివరించారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. తాను నిరుద్యోగుల పక్షాన ఉంటానని, వారి విషయంలో అన్యాయం జరిగితే కఠినంగానే వ్యవహరిస్తానని గవర్నర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే గత చైర్మన్, సభ్యులను తొలగించాల ని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. 

కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాళ్లు రాజీనామా చేసినప్పటికీ, చర్యలు తీసుకునే అంశా న్ని తాను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అయితే ‘‘మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం వారి రాజీనామాలు ఆమోదించాలని, కొత్త కమిషన్​ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అది మనసులో పెట్టుకునే వాళ్ల రాజీనామాలను ఆమోదించాను. చైర్మన్, మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫార్సు చేస్తే వెంటనే ఆమోద ముద్ర వేస్తాను. ఆ విషయంలో నావైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది” అని గవర్నర్ భరోసా ఇచ్చారు. గురువారం లేదా శుక్రవారం కమిషన్​ చైర్మన్ గా మహేందర్ రెడ్డి పేరుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఇది కోర్టు పరిధిలో ఉన్నందున కొత్త పేర్లను తాను స్వీకరించనని గవర్నర్​ ఇప్పటికే స్పష్టం చేశారు. కోర్టు ఆర్డర్​వచ్చే వరకు వేచి చూడాలని ప్రభుత్వానికి సూచించారు. 

సభ్యుల ఎంపికపై సెర్చ్ కమిటీ ఫోకస్.. 

టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్​ రెడ్డి పేరును గవర్నర్​కు పంపగా, ఇప్పుడు సభ్యుల ఎంపికపై సెర్చ్​కమిటీ దృష్టిసారించింది. దాదాపు 600 అప్లికేషన్లు రాగా..  అందులో సభ్యుల రేసులో 400 మందికి పైగా ఉన్నారు. చైర్మన్, సభ్యుల నియామకం కోసం సీఎస్‌‌‌‌ శాంతికుమారి, లా సెక్రటరీ, జీఏడీ సెక్రటరీలతో కూడిన  కమిటీ సమావేశమై దరఖాస్తులను పరిశీలిస్తున్నది. టీఎస్​పీఎస్సీ చైర్మన్, మెంబర్ పోస్టుల కోసం ఆలిండియా సర్వీసు అధికారులతో పాటు ప్రొఫెసర్లు, డాక్టర్లు కూడా అప్లై చేసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో కమిటీ వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. ఎవరెవరికి ఎలాంటి నేపథ్యం ఉన్నది ? ప్రస్తుతం వారు ఏ హోదాలో ఉన్నారు ? అనేది పూర్తిస్థాయిలో చూస్తున్నది. ఒకట్రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్​చేసి గవర్నర్​కు పంపనున్నారు. చైర్మన్ తో కలిపి మొత్తం 11 మంది కమిషన్​లో ఉంటారు. అయితే టీఎస్ పీఎస్సీ మెంబర్ అరుణ కుమారి మినహా అందరూ రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఒక చైర్మన్, మరో 9 మంది సభ్యులను నియమించనున్నారు.

ఆ ఇద్దరిని అనుకున్నప్పటికీ కుదరలే.. 

యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో కమిషన్ లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా చైర్మన్‌‌‌‌ పోస్టు కోసం చాలా మంది పేర్లను ప్రభుత్వం పరిశీలించింది. ప్రధానంగా రిటైర్డ్​ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరు మొద ట తెరపైకి వచ్చింది. అయితే టీఎస్​పీఎస్సీ చైర్మన్ వయసు 62 ఏండ్లు దాటకూడదు. మురళి వయస్సు 62 ఏండ్లు దాటడంతో.. మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా సీఎం రేవంత్ పరిశీలించినట్టు తెలిసింది. ప్రవీణ్ కుమార్​తో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు కూడా జరిపారు. అయితే తాను రాజకీయ పా ర్టీలో ఉన్నానని, ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో టీఎస్​పీఎస్సీని గాడిన పెట్టాలంటే ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని భావించి సీనియర్ ​ఐపీఎస్​ల లిస్టును పరిశీలించారు. కొంతమంది వారి సర్వీసును వదులుకునేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేం దర్​ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మహేందర్ రెడ్డి వయసు కూడా మరో 10 నెలలైతే 62 ఏండ్లు దాటుతుంది. ఆ లోపు టీఎస్​పీఎస్సీని సెట్ ​చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కొత్త కమిషన్ ​ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అది మనసులో పెట్టుకునే టీఎస్​పీఎస్సీ చైర్మన్​, సభ్యుల రాజీనామాలను ఆమోదించాను. చైర్మన్, మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫార్సు చేస్తే వెంటనే ఆమోద ముద్ర వేస్తాను. ఆ విషయంలో నావైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది.
- సీఎం రేవంత్​తో గవర్నర్​ తమిళిసై