సీపీఐకి కొత్త బాస్‌: తప్పుకోనున్న సురవరం

సీపీఐకి కొత్త బాస్‌: తప్పుకోనున్న సురవరం

సీపీఐ నాయకత్వం మార్పుకు రంగం సిద్ధమైంది. ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ సురవరం సుధాకర్‌రెడ్డి వచ్చే నెలలో బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు తెలిసింది. సుమారు ఏడేళ్ల పాటు పదవిలో ఉన్న సురవరం అనారోగ్య కారణాల వల్ల దిగిపోతున్నట్టు సమాచారం. ఢిల్లీలో జులై 20న జరిగే నేషనల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్టు తెలిసింది. 2012 మార్చి 31న జనరల్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన సురవరం వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. మూడో టర్మ్‌ పదవీకాలం 2021 వరకు ఉంది. ‘77 ఏళ్ల సురవరం ఎక్కువగా ప్రయాణించలేరు. ఊపిరితిత్తుల సమస్య, అలర్జీ ఉన్నాయి. వేడి, చలిని తట్టుకోలేకపోతున్నారు. అందుకే రిటైర్‌ అవ్వాలనుకుంటున్నారు’ అని పార్టీ నేతలు చెప్పారు. జనరల్‌ సెక్రటరీ రేసులో పార్టీ నేషనల్‌ సెక్రటరీ డీ రాజా, ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అమర్‌జీత్‌ కౌర్‌, పార్టీ కేరళ సెక్రటరీ కనమ్‌ రాజేంద్రన్‌ ముందున్నారు. కొత్త బాస్‌ను ఏకాభిప్రాయంతోనే ఎన్నుకుంటారని పార్టీ నేతలు చెప్పారు.

వర్గ దోపిడీపై పోరాటం ఆపొద్దు; సురవరం

దారిద్ర్యం, వర్గ దోపిడీ నిర్మూలన కోసం పోరాటం కొనసాగించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్ది అన్నారు. రావి నారాయణ రెడ్డి 112వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సురవరం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నారాయణ రెడ్ది చిన్న వయస్సు నుంచే రాష్ట్రంలో భూ సంస్కరణలు, దళితుల సమస్యలు, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటం కార్చిచ్చులా, ప్రజా ఉద్యమంగా వ్యాపించడానికి ఆయన చేసిన పోరాటం మహోన్నతమైందన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నారాయణ రెడ్ది తనకున్న 300 ఎకరాలకు పైగా భూమిని ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారినా ఇంకా భూ సమస్య ఉందని, భూ ప్రక్షాళన, అవినీతిపై సమరం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.