హైవేలను కలుపుతూ బైపాస్ .. ఎన్ హెచ్-44, 167ను అనుసంధానం చేస్తూ ప్రపోజల్స్

హైవేలను కలుపుతూ బైపాస్ .. ఎన్ హెచ్-44, 167ను అనుసంధానం చేస్తూ ప్రపోజల్స్
  • కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్​ రెడ్డి
  • త్వరలో బడ్జెట్​ కేటాయిస్తామని హామీ
  • డీపీఆర్​ సిద్ధం చేసుకోవాలని ఆదేశం

మహబూబ్​నగర్, వెలుగు: మహబూబ్ నగర్–-జడ్చర్ల మధ్య ట్రాఫిక్​ ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త బై పాస్​ రోడ్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రెండు వారాల కింద మహబూబ్​నగర్​ శివారులోని అప్పన్నపల్లి గ్రామం వద్ద ఉన్న ఆర్వోబీ నుంచి హన్వాడ మండలం చిన్నదర్పల్లి మీదుగా చించోలి హైవేకు లింక్​ చేస్తూ ఓ బై పాస్​ ఏర్పాటుకు మంజూరు లభించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్​ పిలవాలని ఇటీవల కేంద్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాజాగా మరో బై పాస్​ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ బై పాస్​కు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో మరో బైపాస్​ ఏర్పాటు చేసి హైవేలను అనుసంధానం చేసేలా డిజైన్​ చేశారు. 

కేంద్ర మంత్రి గడ్కరీకి వినతి..

మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణతో కలిసి పాలమూరు, జడ్చర్ల ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీని కలిశారు. మహబూబ్​నగర్–​-జడ్చర్ల మధ్య బై పాస్​ నిర్మించాలని కోరారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి అందజేశారు. రెండు హైవేలను కలిపేలా ఈ ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. మహబూబ్​నగర్–​-జడ్చర్ల మధ్య ఎన్​హెచ్​-167 నక్కలబండ తండా నుంచి బండమీదిపల్లి, శంకరాయపల్లి, పోలేపల్లి మీదుగా మాచారం వద్ద ఎన్​హెచ్–-44కు లింక్  చేయవచ్చని చెప్పారు. అక్కడి నుంచి గంగాపురం వరకు తీసుకెళ్లి మళ్లీ ఎన్​హెచ్–​-167కు కలిపేలా మ్యాప్​ రూపొందించారు. దాదాపు పది కిలోమీటర్ల మేర ఈ బైపాస్​ నిర్మించాల్సి ఉంటుంది. 

ఇందుకు దాదాపు రూ.270 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. డీపీఆర్​ చేయించాలని సూచించారని, డీపీఆర్​ రాగానే బడ్జెట్​ కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి తెలిపారు.

బైపాస్​లు అనివార్యం..

ఈ హైవేల మీద బైపాస్​ నిర్మాణం అనివార్యంగా మారింది. ఇప్పటికే భూ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్పూర్,​- మహబూబ్​నగర్​ మధ్య ఓ బై పాస్​ నిర్మాణంలో ఉంది. ఈ పనులు 70 శాతం పూర్తయ్యాయి. పాలమూరు యూనివర్సిటీ వద్ద బ్రిడ్జి పనులు మిగిలి ఉన్నాయి. ఈ బైపాస్​ పూర్తయితే ఎన్​హెచ్–44 నుంచి బెంగళూరు, కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎన్​హెచ్–-167 మీదుగా పాలమూరులోకి రాకుండానే యూనివర్సిటీ బ్యాక్​ సైడ్​ నుంచి వెళ్లిపోతాయి. దీంతో పాత పాలమూరు, వన్​టౌన్​ ఏరియాలో ట్రాఫిక్​ కంట్రోల్​ అవుతుంది. ఇటీవల అప్పన్నపల్లి ఆర్వోబీ నుంచి చిన్నదర్పల్లి మీదుగా చించోలికి(ఎన్​హెచ్–167ఎన్​)కు లింక్​ కలిపే బైపాస్​ కేంద్రం మంజూరు చేయగా, ఇది పూర్తయితే హైదరాబాద్, జడ్చర్ల, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండానే డైవర్ట్​ అవుతాయి. 

దీంతో టీడీగుట్ట, న్యూ టౌన్, బస్టాండ్​ చౌరస్తా, పాత బస్టాండ్​లో ట్రాఫిక్​ సమస్య తీరుతుంది. తాజాగా ప్రతిపాదించిన బైపాస్​ సాకారమైతే కర్నాటక, హైదరాబాద్​ వైపు నుంచి వచ్చే వాహనాలు, అలాగే మహబూబ్​నగర్ నుంచి కల్వకుర్తి వెళ్లే వాహనాలను జడ్చర్ల పట్టణంలోకి రాకుండా డైవర్ట్​ చేయొచ్చు. దీంతో జడ్చర్లలోని కొత్త బస్టాండ్, సిగ్నల్​ గడ్డ, కల్వకుర్తి రోడ్డులో ట్రాఫిక్​ సమస్య తీరే అవకాశం ఉంది. 

తీరనున్న ట్రాఫిక్​ తిప్పలు..

మహబూబ్​నగర్​ జిల్లాలో ఎన్​హెచ్–167, ఎన్​హెచ్–167(ఎన్) ఉన్నాయి. ఇందులో 167 (ఎన్​) జిల్లాలోని భూత్పూర్​ నుంచి మొదలై మహబూబ్​నగర్​ మీదుగా కర్నాటక రాష్ట్రంలోని చించోలి వరకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ హైవే పనులు నడుస్తున్నాయి. ఎన్​హెచ్-167 కర్నాటకలోని రాయచూరు నుంచి ప్రారంభమై మహబూబ్​నగర్, జడ్చర్ల మీదుగా కోదాడ వరకు 483 కిలోమీటర్లు సాగుతుంది. అయితే ఈ రెండు హైవేలు మహబూబ్​నగర్, జడ్చర్ల టౌన్​ నుంచి వెళ్తున్నాయి. 

దీంతో జిల్లా కేంద్రానికి వివిధ పనులు నిమిత్తం వచ్చే వారు, జడ్చర్లలోని ఆయా పరిశ్రమల్లో పనులు చేయడానికి వెళ్లే వారు, అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్​ వాహనాలు, భారీ లారీలు, ఆటోల రాకపోకలతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్​ ఉంటోంది. ఈ క్రమంలో తరచూ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ట్రాఫిక్​ జామ్​తో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈక్రమంలో బైపాస్​ నిర్మాణం జరిగితే ట్రాఫిక్​ తిప్పలు దూరమవుతాయి.