అమలులోకి కేబుల్ టీవీ కొత్త రూల్స్

అమలులోకి కేబుల్ టీవీ కొత్త రూల్స్

ఇవాళ్టి నుంచి కేబుల్ టీవీ రూల్స్ మారిపోనున్నాయి. మరి.. మీరు చూడాలనుకుంటున్న చానెళ్లను ఎంపిక చేసుకున్నారా….లేకపోతే వెంటనే చేసేసుకోండి. మీ కేబుల్ ఆపరేటర్ దగ్గరకెళ్లండి. DTH అయితే  మీ కెలాగూ ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు. వెంటనే సెలెక్ట్ చేసుకోండి. ఇష్టమైన ప్యాక్ లు లేదా ఒక్కో చానెల్ ను ఎంపిక చేసుకోండి. DTH, కేబుల్ ఆపరేటర్లంతా ఈ కొత్త రూల్స్ ప్రకారమే ఇకపై సర్వీస్ ఇస్తారు. దీనిపై టెలికాం రెగ్యులేట రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. DTH , కేబుల్ ఆపరేటర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. ఫిర్యాదు చేసేందుకు నంబర్ కూడా ఇచ్చింది. మీకిష్టమైన చానెళ్లు కాకుండా వారికి నచ్చిన చానెళ్ల ప్యాకేజీలను బలవంతంగా రుద్దాలని చూసినా,  ప్యాక్ లో ఫ్రీ చానెళ్లను చేర్చినా ట్రాయ్ కాల్ సెంటర్ 0120–6898689కు ఫోన్ చేయొచ్చని ప్రకటనలో తెలిపింది. లేదా das@trai.gov. inకు మెయిల్ చేయాలని సూచించింది. ఒకవేళ  చానెళ్లను ఎంపిక చేసుకోకపోతే ఆలస్యం చెయకుండా వెంటనే కేబుల్ ఆపరేటర్ ను సంప్రదిం చాలని సూచించింది. సెలెక్ట్ చేసుకున్న చానెళ్లను నెలలోపు ఎప్పుడైనా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. నెల తర్వాత మాత్రం ఎంపిక చేసుకున్నప్యాకే కొనసాగుతుంది.

DTH వినియోగదారులకు ట్రాయ్ చిన్న వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే  లాంగ్ అండ్ షార్ట్  డ్యూరేషన్ ప్యాక్ వేయించుకున్న యూజర్లు.. అది ఎక్స్ పైరీ అయ్యేవరకు కొత్త రూల్స్ కు మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం లేదని,DTH ఆపరేటర్లూ అందుకు సహకరించాలని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. కొందరు ఆపరేటర్లు బలవంతంగా  ఆ ప్యాక్లను ఆపేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని… పాత ప్యాక్ ల కాలపరిమితి అయిపోయే వరకు వారికి అవకాశమివ్వాలని డీటీహెచ్ సంస్థలకు సూచించారు. ఇక, లాంగ్ డ్యూరియేషన్ లేదా షార్ట్ డ్యూరియేషన్ ప్యాక్ లో ఉన్నవారు మైగ్రేట్ అవ్వా లనుకుంటే.. పాత ప్యాక్ లకు చెల్లించిన మొత్తంలోనే కొత్త ప్లాన్ ను అమలు చేయాలని ఆదేశించారు. వినియోగదారులు కూడా దానికి తగినట్టుగా త్వరగా చానెళ్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. డీటీహెచ్ పూర్తిగా ప్రీపెయిడ్ సిస్టం కాబట్టి.. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకూ ప్రసారాలకు ఆటంకం ఉండబోదని స్పష్టం చేశారు. ఇక, మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీస్కెళ్లడంలో కేబుల్ టీవీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.