కేంద్ర సంబంధాల్లో కొత్త మార్పు

కేంద్ర సంబంధాల్లో కొత్త మార్పు

 ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రులు స్వాగతించటం ప్రజాస్వామిక సంప్రదాయం. కానీ, ఏదో ఒక సాకుతో ప్రధాని వచ్చినప్పుడల్లా కేసీఆర్ ముఖం చాటేశారు. దీంతో కేంద్రంతో సాధించుకోవాల్సిన అంశాలు, తెలంగాణకు అడిగి తెచ్చుకోవాల్సిన ప్రయోజనాలన్నీ దక్కకుండా పోయాయి. అంటే  కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ ద్వేష వైఖరులన్నీ తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేకూర్చాయి.  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు భిన్నంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచీ కేంద్రంతో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇక్కడ గవర్నర్​ను గౌరవించటంతోపాటు.. అక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతోనూ అంతే సామరస్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రంతో తెలంగాణ సంబంధాల పునరుద్ధరణకు సరికొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి.  గతంలో వరుసగా రెండుసార్లు గవర్నర్ కోటా కింద అప్పటి ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఇటీవల కొత్త ప్రభుత్వం నామినేట్ చేసిన ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను కొర్రీలేమీ పెట్టకుండా క్లియర్ చేశారు. అప్పటికే బీఆర్ఎస్ లీడర్లు వేసిన కోర్టు కేసు కారణంగా ఈ నియామకాలు ఆగిపోవటం వేరే విషయం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ నియామకాల్లోనూ ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లనే గవర్నర్ ఆమోదించారు. 

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల మధ్య ఐక్యత, సమన్వయం, సర్దుబాటు ఉన్నప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాతలు బలంగా విశ్వసించారు. వాటికి అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర సంబంధాలను రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో  పొందుపరిచారు. కానీ, రాజ్యాంగ స్ఫూర్తిని  లెక్కచేయకుండా రాష్ట్రాలు మొండికేస్తే నష్టపోయేదెవరు?.  గడిచిన పదేండ్లలో మన  తెలంగాణ రాష్ట్రం అందుకొక ఉదాహరణగానే మిగిలిపోయింది.  ‘భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరముంది.. నేను ఆషామాషీగా చెప్పడం లేదు..  ఆన్ ది రికార్డు మాట్లాడుతున్నా.’ అని మాజీ సీఎం కేసీఆర్ మీడియాను దబాయించి చెప్పిన తీరు తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదు.  ‘శభాష్... భలే కట్టినవ్  కాళేశ్వరం.. కేసీఆర్ కాదు నీ పేరు కాళేశ్వరరావు’ అని పొగిడిన గవర్నర్ ఉన్నంతకాలం ఆయన సేవలో తరించిన కేసీఆర్.. ఆ తర్వాత రోజుల్లో తన వ్యవహారానికి అడ్డు చెప్పినందుకు మహిళా గవర్నర్ తమిళిసైకి కనీసం ప్రొటోకాల్ మర్యాదలు కూడా పాటించలేదు. గవర్నర్​ను అవమానించిన తీరును సమాజం కళ్లారా చూసింది. అటు రాజ్యాంగాన్ని ఇటు గవర్నర్ల వ్యవస్థను ఖాతరు చేయకుండా ఒంటెత్తు పోకడలను అనుసరించిన కేసీఆర్.. కేంద్ర రాష్ట్ర సంబంధాలను వీలైనంత మేరకు చెడగొట్టారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సున్నితమైనవి. లౌక్యంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి మేలు చేస్తాయి. ఆశించినంత కాకున్నా ఎంతో కొంతమేరకు ఎక్కడో ఒక చోట ప్రయోజనం చేకూరుస్తాయి.  అదేమీ పట్టించుకోకుండా కేంద్రంతో ఎడముఖం పెడముఖంగా ఉంటే అంత మేరకు నష్టం తెచ్చిపెడతాయి. 

ప్రజాస్వామిక సంప్రదాయాల పునరుద్ధరణ

గతంలో తెలంగాణ సెక్రెటేరియట్​కు రాజ్​భవన్​కు మధ్య అఘాతం పెరిగింది. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే నాడు  గవర్నర్ ఆతిథ్యమిచ్చే ఎట్ హోం కార్యక్రమానికి కూడా అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లకుండా దూరంగా ఉన్నారు. కానీ.. కొత్త ప్రభుత్వం వచ్చీ రాగానే ప్రజాస్వామిక సంప్రదాయాల పునరుద్ధరణ జరిగింది. గడిచిన రెండు నెలల్లోనే ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి పలుమార్లు రాజ్​భవన్​కు వెళ్లి.. మర్యాద పూర్వకంగా గవర్నర్​తో  భేటీ అయ్యారు.  ఎట్ హోం నాడు ముఖ్యమంత్రి, మంత్రుల సందడితో  రాజ్​భవన్​లో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో ఉన్న ఎన్టీఆర్..  కాంగ్రెస్ ప్రధాన మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా హుందాగా మర్యాదపూర్వకంగా వారికి స్వాగతం పలికేవారట. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నిర్వహించే అధినేతలకు ఉండే సంస్కారానికి అదో నిదర్శనమని ఇప్పటికీ ఆ తరం నేతలు గుర్తు చేస్తూనే ఉన్నారు. అధికారం చేపట్టిన తర్వాత  ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు,  ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి వాళ్ల ముందుంచి తన ప్రాధాన్యమేమిటో చాటుకున్నారు. అన్ని రంగాల్లోనూ కేంద్రం నుంచి  నిధులు రాబట్టుకునేందుకు రేవంత్​రెడ్డి దూరదృష్టితో వ్యవహరిస్తున్నట్లు వరుసగా జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతోంది. 

రేవంత్​ చొరవతో ‘జయ జయహే తెలంగాణ’ 

ఏళ్లకేళ్లుగా పెండింగ్​లో పడ్డ  మెహిదీపట్నం స్కై వాక్ పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపారు. కేంద్ర మంత్రికి ఆయన చేసిన విజ్ఞప్తులతోనే రక్షణ మంత్రిత్వ శాఖ అక్కడి భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. తెలంగాణకు అదనంగా మరిన్ని ఐపీఎస్ పోస్టులు కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్​షాను రేవంత్ రెడ్డి కోరారు. అది కూడా ఫలించింది. మూడేండ్లుగా రిపబ్లిక్ డే పరేడ్లో కనిపించని తెలంగాణ శకటం.. కొత్త ప్రభుత్వం చొరవతో ఈసారి వేడుకల్లో ‘జయ జయహే తెలంగాణ’ అంటూ తన ప్రత్యేకతను దేశానికి చాటుకుంది. పాలమూరు– రంగారెడ్డి భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి ప్రధానిని కలిసిన సమయంలోనే విజ్ఞప్తి చేశారు. తర్వాత జలశక్తి మంత్రి సమక్షంలోనూ అదే విషయం చర్చకు వచ్చినప్పుడు..  ఏ రాష్ట్రంలోనూ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వటం లేదని కేంద్రం తన స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. అదే సమయంలో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు  పీఎంకేఎస్వైలో ఆర్థిక సాయం అందించేందుకు వీలుందని, అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్రానికి సూచించటం శుభపరిణామం. 2020లో గత ప్రభుత్వ హయాంలోనూ కేంద్రం అదే సూచనలు చేసింది.  కాళేశ్వరం ప్రాజెక్టుకు పీఎంకేఎస్వైలో ఆర్థిక సాయం కోరుతూ  ప్రతిపాదనలు పంపించాలని కోరింది. అప్పటి సీఎం కేసీఆర్ కేంద్రం మాటలు ఖాతరు చేయకుండా పెడచెవిన పెట్టారు. ప్రతిపాదనలను కూడా పంపకుండా అయిష్టత ప్రదర్శించారు. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాకుండా పోయింది. కేంద్రంతో పేచీ కారణంగా కోట్లాది విలువైన తెలంగాణ సంపద గోదావరి పాలయినట్లయింది. 

ఆర్ఆర్ఆర్​ చర్చలు ఫలవంతం

గతంలో రాష్ట్రం జమ చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంటు నిధులు ఇవ్వకపోవటంతో కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు నాలుగైదు ఏండ్లుగా తెలంగాణకు రాకుండా పోయాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం తన వాటా జమ చేయటంతో గ్రామ పరిశుభ్రత కార్యక్రమానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. పట్టణాల్లో అభివృద్ధి పనులు, సంస్కరణలకు రూ. 1,500 కోట్లు కేటాయించాలని ఇటీవలే  కేంద్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు విజ్ఞప్తి చేశారు.  వీటికి తోడు హైదరాబాద్ విస్తరణ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అవుటర్ రింగ్ రోడ్డు అవతల రీజనల్ రింగ్ రోడ్డు పనులను కొత్త ప్రభుత్వం వేగవంతం చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో ఉన్న చిక్కుముళ్లన్నీ పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జరిపిన తాజా చర్చలు ఫలవంతమయ్యాయి. అన్నింటికీ కేంద్రం సానుకూలత వ్యక్తం చేయటంతో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులకు లైన్ క్లియర్ అయింది. కొత్త ప్రభుత్వం అతి తక్కువ వ్యవధిలోనే  చేసిన ఈ  వరుస ప్రయత్నాలన్నీ తెలంగాణ పునర్నిర్మాణ  సంకేతాలుగా కనిపిస్తున్నాయి.  ప్రభుత్వ నిర్వహణ బాధ్యతను చేపట్టిన పాలకులెవరైనా సరే... రాజకీయాలకు మించి  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనే విజ్ఞత, అంతకు మించిన విశాల దృక్పథం, దూరదృష్టితోనే  వ్యవహరించాలి. కానీ, స్వార్థపూరితంగా, సంకుచితంగా ఒంటెత్తు పోకడలకు పోతే వాళ్లకు పోయేదేమీ ఉండదు. చివరకు నష్టపోయేది ప్రజలే.

కేసీఆర్​ రాజకీయ స్వార్థం

కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్రానికి సంబంధించిన అంశాల్లో హుందాగా, బాధ్యతగా ఉండాల్సిన గత పాలకుడు కేసీఆర్.. తన రాజకీయ స్వార్థంతో  పొద్దు తిరుగుడు పువ్వులా వ్యవహరించారు. దీంతో గడిచిన పదేండ్లలో తెలంగాణ ప్రాంతానికి లాభానికి మించి నష్టం ఎక్కువగా జరిగింది. అధికారం చేపట్టిన తొలి అయిదేండ్లు ఎన్డీఏతో జట్టుగా సత్సంబంధాలు నెరిపిన కేసీఆర్ అటు ప్రధానితోపాటు ఇటు కేంద్రంపై మితిమీరిన ప్రేమను ఒలకబోశారు. కొవిడ్ మహమ్మరి విజృంభించిన సమయంలో.. ఇంటి ముందు దీపం వెలిగించి... చప్పట్లు కొట్టమని ప్రధాని చెప్పినట్లు చేయటంలో తప్పేముంది అని నరేంద్ర మోదీని కీర్తించిన కేసీఆర్.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టిన వాళ్లందరినీ అసెంబ్లీలోనే  చెండాడినంత పని చేశారు.  జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా భేష్ అని మెచ్చుకున్నారు. వాటిని వ్యతిరేకిస్తూ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే సీతక్కపై ఒంటికాలిపై లేచి మండిపడినంత పనిజేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం మద్దతు పలికింది. తొలి అయిదేండ్లలో ఏకపక్షంగా ఎన్డీఏతో అంటకాగిన కేసీఆర్, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజకీయ ఎజెండా మార్చుకున్నారు. జాతీయ పార్టీ  పెట్టాలనే తన ఆలోచనలతో  మోదీని విభేదించటం మొదలుపెట్టారు. కానీ, ముఖ్యమంత్రిగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను కొనసాగించాలనే తెలంగాణ ప్రయోజనాల కోణాన్ని విస్మరించారు.

-  బొల్గం శ్రీనివాస్, సీఎం పీఆర్​వో