health Alert : దేశంలో కొత్త చికెన్‌పాక్స్ వైరస్ వేరియంట్

health Alert : దేశంలో కొత్త చికెన్‌పాక్స్ వైరస్ వేరియంట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) భారతదేశంలో క్లాడ్ 9 అనే పేరుతో వరిసెల్లా అని పిలువబడే చికెన్‌పాక్స్ కొత్త వేరియంట్ ను కనుగొంది. వరిసెల్లా-జోస్టర్ వైరస్ (VZV)కి కారణమయ్యే వేరియంట్ దేశంలో మొదటిసారిగా కనుగొనబడింది. జర్మనీ, యూకే, యూఎస్ వంటి దేశాలలో ఇది సాధారణం. పిల్లలు, టీనేజ్, పెద్దలలో సాధారణంగా చికెన్‌పాక్స్‌కు గురవుతూ ఉంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇది హెర్పెస్వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ ప్రసారం ఏరోసోల్స్ లేదా శ్వాసకోశ స్రావాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా సంభవిస్తుంది. ఇది పిల్లలలో తేలికపాటి రుగ్మతలకు మాత్రమే దారితీస్తుందని, పెద్దలలో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా నవజాత శిశువులలో, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కొన్ని సార్లు ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

లక్షణాలు

వరిసెల్లా లేదా చికెన్‌పాక్స్ అనేది సాధారణంగా నెత్తిమీద, ముఖం మీద మొదలయ్యే దురద దద్దుర్లతో ప్రారంభమవుతుంది. మొదట్లో జ్వరం లాంటి అనారోగ్యం కనిపించవచ్చని WHO తెలిపింది. ఇది న్యుమోనియా లేదా ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు)కి కూడా కారణమవుతుంది, కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారవచ్చు. ఇతర లక్షణాలకొస్తే ఆకలి తగ్గడం, తలనొప్పి, జ్వరం, శరీర నొప్పులు లాంటి అనారోగ్యం ఉండవచ్చు. దద్దుర్లు సాధారణంగా వైరస్‌కు గురైన 2-3 వారాల తర్వాత కనిపిస్తాయి. కొంచెం గడ్డలుగా కనిపిస్తాయి.

నివారణ

వైరస్ బారిన పడకుండా ఉండేందుకు టీకాలు వేయడం ఉత్తమ మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన పరిశుభ్రతను పాటించడం,  క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని కూడా చెబుతున్నారు.