మరో వేరియంట్ వైరస్ వెలుగులోకి వచ్చింది

మరో వేరియంట్ వైరస్ వెలుగులోకి వచ్చింది
  • బీ.1.1.28.2: వేరియంట్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయట
  • బ్రెజిల్, యూకే నుంచి తిరిగొచ్చిన ప్రయాణికుల నుంచి వెలుగులోకి రాక

పుణె: భారతదేశంలో కరోనా వైరస్ లో  మరో కొత్తరకం వేరియంట్ వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్, యూకే దేశాల నుంచి తిరిగొచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేయగా.. కొత్త వేరియంట్ సోకినట్లు తేలింది. బీ1.1.28.2:  వేరియంట్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్.ఐ.వి) అధ్యయనంలో కరోనా వైరస్ లో  కొత్త వేరియంట్ బీ.1.1.28.2 బయటపడింది. వైరస్ మార్పులకు సంబంధించి అధ్యయనం చేయగా లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శరీరం వేగంగా బరువు కోల్పోవడంతోపాటు ఊపిరి తిత్తులపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయని గుర్తించినట్లు వైరాలజీ నిపుణులు తెలిపారు. 
కరోనా వైరస్ లో చోటు చేసుకుంటున్న మార్పుల(మ్యూటెంట్ల) గురించి దేశంలో ఉన్న పది కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 30 వేల అనుమానాస్పద నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టింది. కొత్త వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. కొత్తగా వెలుగులోకి వస్తున్న కరోనా వేరియంట్లతో ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అర్థం అవుతోందని, ప్రమాదం పొంచిఉన్నట్లుగానే పరిగణించాలని హెచ్చరించింది. కరోనా వైరస్.. కొత్త వేరియంట్లను నిరోధించాలంటే ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రతి దేశం 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసే వరకు సురక్షితం అనుకునే వీలులేదని స్పష్టం చేసింది.