ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువగా తీసుకు రావడం హర్షించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు మరింత చేరువ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో అధికారిక పనులను సునాయాసంగా చేసుకోవడానికి వెసులుబాటు కలిగింది. కానీ, ఒకే మండలం రెండు జిల్లాల్లో, రెండు శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉండటంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. అభివృద్ధి కొరవడింది. ప్రజా ప్రతినిధులిద్దరూ ఎవరికివారు ముఖాలు చూసుకుంటూ సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నారు.
'నీ పరిధంటూ' ఎవరికివారు నేతలు ప్రజలకు అందుబాటులో ఉండకుండా తప్పించుకుంటున్నారు. ఒకే పార్టీకి చెందిన ప్రతినిధులైతే కొంతమేరకు ఫరవాలేదు గానీ, ఇరు పార్టీలకు చెందినవారైతే ఆ గ్రామాలవైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ సమస్యను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన హేతుబద్ధంగా చేపట్టాలని నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామం.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రంలోని పది జిల్లాలను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది. తొలుత 31 జిల్లాలుగా ఏర్పాటు చేసిన అనంతరం మరో రెండు జిల్లాలను కలిపి జిల్లాల సంఖ్యను 33కు పెంచింది. అలాగే రెవెన్యూ డివిజన్లు పెరగగా, రెవెన్యూ మండలాల సంఖ్య 612కు చేరింది. ఆ తర్వాత 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా వర్గీకరించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదంతో 2018 ఆగస్టు నుంచి నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది.
దీంతో ప్రభుత్వ విభాగాల విభజన, ఉద్యోగుల కేటాయింపులు, స్థానికత నిర్ధారణ, ఉద్యోగ నియామకాలు ఇలా రకరకాల అంశాల్లో మార్పులు తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు ఐదేళ్ల కాలం పట్టింది. అయినప్పటికీ ఉద్యోగుల కేటాయింపులు, స్థానికతకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ తలనొప్పిగా మారింది. ఈ సమయంలో కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల హేతుబద్ధీకరణ తెరపైకి రావడంతో ప్రజల్లో ఒకరకమైన ఆందోళన, చర్చ మొదలయింది.
ఇష్టానుసారంగా విభజన
జిల్లాలు, రెవెన్యూ, మండలాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదనేది కాంగ్రెస్ ప్రభుత్వ భావనగా ఉంది. జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించడంతో హేతుబద్దత కొరవడిన మాట వాస్తవం. కొన్ని జిల్లాల్లో ఎనిమిది మండలాలు, మరికొన్ని జిల్లాల్లో పదికంటే ఎక్కువ మండలాలు ఉన్నాయి. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉండటంతో హేతుబద్దత లేకుండా పోయింది.
ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే, మరో లీడర్ 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా చేయకపోవడంతో కొన్ని శాసనసభ నియోజకవర్గాలు రెండు మూడు జిల్లాల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఐదు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. ఇలాంటివి మరిన్ని ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి, సూచనల మేరకు ఆరు నెలల్లో జిల్లాలను పునర్విభజన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండకుండా స్థానిక ప్రజలు స్వచ్ఛంధంగా కమిషన్ ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించాలని ఆయన కోరారు.
అయితే ప్రస్తుతమున్న 33 జిల్లాలను తగ్గిస్తారా, పెంచుతారా అనేది కమిషన్ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఈ పునర్విభజనపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. ఇదిలావుండగా, ఒక్క జిల్లాను ముట్టుకున్నా పెద్దఎత్తున ఉద్యమం తలపెట్టనున్నట్లు బీఆర్ఎస్ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రజల్లో ఆందోళన
జిల్లాలన్నీ శాస్త్రీయంగా ఉన్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తాము ఏర్పాటు చేసిన నూతన జిల్లాల రద్దుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ... ఈ ప్రయత్నాలపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలమూరులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో పరిపాలన వికేంద్రీకరణ కోసం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, పాలమూరు జిల్లా బిడ్డగా చెప్పుకొంటున్న రేవంత్ రెడ్డి మాత్రం వాటిని రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్ వివరించారు. శాస్త్రీయత, అశాస్త్రీయత మధ్య జిల్లాల ప్రజలు ఊగిసలాడుతున్నారు.
జిల్లా ఉంటుందో ఊడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పార్లమెంట్ నియో జకవర్గాలను ప్రామాణికంగా తీసుకొని జిల్లాలను క్రమబద్ధీకరిస్తారనే వాదన కూడా ఉంది. ఇలా జరిగితే పదికిపైగా జిల్లాలు రద్దవడానికి అవకాశముంటుంది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల ఏర్పాటు డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. కానీ, జిల్లాను చేయడానికి కావలసిన సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే జిల్లాకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజల ప్రమేయం లేకుండానే కొన్ని జిల్లాలు ఏర్పడ్డాయి.
రేషనలైజ్ చేయాలి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయత, హేతుబద్ధత ప్రామాణీకంగా తీసుకొని జిల్లాలను పునర్విభజన చేయాలని భావిస్తోంది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం కాకుండా రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్ ఎంత ఉండాలి, జిల్లా పరిధి ఎంత ఉండాలనేది నిర్ణయించాలి.
ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే, మరో జిల్లాలో కోటి జనాభా ఉంది. జనాభా ప్రాతిపదికన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను హేతు బద్దీకరిస్తే... జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎలాగైనప్పటికీ స్థానికత ప్రధాన అంశంగా ఉండనుంది.
ఈ నేపథ్యంలో ఉద్యోగాల సాధన కోసం కసరత్తు చేస్తున్న నిరుద్యోగులతోపాటు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, స్థానిక రాజకీయ నాయకులు, ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. పాలనా పరంగా, జోనల్, మల్టీ జోనల్ పరిధుల్లో మార్పులు అనివార్యం కానుండటంతో ఉద్యోగుల కేటాయింపులు, కొత్త ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయాలు కలవరపెట్టనున్నాయి.
కోడం పవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్
