
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తొలగించారు. సర్దార్ పటేల్ రోడ్డులోని పార్టీ ఆఫీసు ఎదుట వెలిసిన ఫ్లెక్సీలను NDMC సిబ్బంది తీసేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఆఫీసు రోడ్డులో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే.. వీటికి అనుమతి లేకపోవడంతో ఫ్లెక్సీలను తొలగించినట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తెలిపారు.
ఢిల్లీలో ఈ నెల 14న బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కేసీఆర్.. రాజ శ్యామల యాగాన్ని మొదలుపెట్టారు. 12 మంది రుత్వికులు ఢిల్లీలో రాజ శ్యామల యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. ఆపై పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూల మంత్ర జపాలతో రాజ శ్యామల యాగ నిర్వహణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మరోవైపు వారం రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించడంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కలిసొచ్చే పార్టీలతో కేసీఆర్ చర్చలు జరపనున్నారు.