వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్ కొత్త ఫీజులు.. డెంటల్, నర్సింగ్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు కూడా..

వచ్చే ఏడాది నుంచి  ఎంబీబీఎస్ కొత్త ఫీజులు.. డెంటల్, నర్సింగ్, హోమియోపతి, పారామెడికల్ కోర్సులకు కూడా..
  • ఈ వారంలోనే  ప్రైవేటు కాలేజీల నుంచి డేటా సేకరణ
  •  ఆడిట్ చేసిన మూడేండ్ల అకౌంట్స్ వివరాల డేటా పరిశీలన
  • వచ్చే మూడేండ్ల బ్లాక్ పీరియడ్​కు కొత్త ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ కసరత్తు

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్ సహా పలు మెడికల్​ కోర్సులో కొత్త ఫీజులు అమలు కానున్నాయి. ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల్లో రానున్న మూడేండ్ల బ్లాక్ పీరియడ్​కు మెడికల్, పారామెడికల్ కోర్సుల్లో ఫీజుల నిర్ణయానికి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇటీవల సమావేశమైంది. ఈ సందర్భంగా కాలేజీల నుంచి వివరాల సేకరణకు టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషనూ రిలీజ్ చేసింది. త్వరలోనే కాలేజీల నుంచి ఆన్​లైన్ ద్వారా డేటా సేకరించేందుకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలోని ఎంబీబీఎస్, మెడికల్ పీజీ కోర్సు, డెంటల్, నర్సింగ్, ఇతర పారామెడికల్ కోర్సులకు రెండేండ్ల కింద నిర్ణయించిన ఫీజుల గడువు 2025–26తో ముగియనున్నది. దీంతో ఆ తర్వాతి 2026– 27 నుంచి 2028– 29 వరకూ మూడేండ్ల బ్లాక్ పీరియడ్​కు కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును టీఏఎఫ్ఆర్సీ ప్రారంభించింది. ప్రధానంగా ఎంబీబీఎస్​లో మూడు కేటగిరీల్లోని సీట్లకు ఫీజులను నిర్ధారించనున్నారు. 

ఆదాయ, వ్యయాల సేకరణ.. 

ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు కొత్త ఫీజుల ప్రతిపాదనలతో పాటు అవసరమైన ఆన్​లైన్ డేటాను టీఏఎఫ్ఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయ వ్యయాల స్టేట్మెంట్లు, ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్లు, డేవలప్​మెంట్ అవసర వివరాలు, సిబ్బంది జీతాలు, మౌలిక వసతుల కల్పనకు చేసిన ఖర్చులు,  వాటి బిల్లులు సమర్పించాల్సిఉంది. 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ ఫైనాన్స్ రిపోర్టును అందించాల్సి ఉంటుంది.  

అక్టోబర్ ఒకటో తారీఖు నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని టీఏఎఫ్ఆర్సీ భావించినా.. వివిధ కారణాలతో రెండోవారం నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 30 నాటికి డేటాను అందించాల్సి ఉంది. డేటా వివరాలను http://tafrconline.telangana.gov.in  వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా  సమర్పించాలి. 

కొత్త ఫీజులు ఈ కోర్సుల్లోనే..

ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కోర్సులు, బీడీఎస్, పీజీ డెంటల్ కోర్సులు, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్​ఎంఎస్, హోమియోపతి (పీజీ), బీఎన్​వైఎస్, జీఎన్​ఎం, ఎంపీహెచ్​, డీఎంఎల్​టీతో పాటు ఇతర పారామెడికల్ కోర్సుల్లో కొత్త ఫీజులు అమలు కానున్నాయి. వీటితో పాటు బీఎస్సీ నర్సింగ్ , పీబీబీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్​టీ, బీపీటీ, ఎంపీటీ తదితర కోర్సుల్లోనూ వచ్చే ఏడాది నుంచి కొత్త ఫీజులు అమలు కానున్నాయి.