రేపు మేనేజ్మెంట్లతో టీఏఎఫ్-ఆర్సీ సమావేశం

రేపు మేనేజ్మెంట్లతో టీఏఎఫ్-ఆర్సీ సమావేశం
  • ఇంజినీరింగ్-లో మళ్లీ కొత్త ఫీజులు!
  • రేపు మేనేజ్మెంట్లతో టీఏఎఫ్-ఆర్సీ సమావేశం  
  • ఫీజులు తగ్గించేందుకు యత్నం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని  ప్రైవేటు ఇంజినీరింగ్​ కాలేజీల్లో మళ్లీ ఫీజులు మారనున్నాయి. గతంలో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులరేటరీ కమిటీ-(టీఏఎఫ్-ఆర్సీ)నిర్ణయించిన ఫీజులను వసూలు చేసుకునేలా హైకోర్టు నుంచి కాలేజీలు ఆర్డర్స్ తెచ్చుకున్నాయి. దీంతో పెరిగిన ఫీజుల పట్ల వ్యతిరేకత రావడంతో, కాలేజీ మేనేజ్మెంట్లతో టీఏఎఫ్-ఆర్సీ మరోసారి చర్చలకు సిద్ధమైంది. సోమవారం కాలేజీలతో అధికారులు సమావేశం కానున్నారు.

2022–25 బ్లాక్​ పీరియేడ్-కు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులను టీఏఎఫ్-ఆర్సీ  ఖరారు చేసింది. ఆమోదం కోసం సర్కారుకు ప్రపోజల్స్ పంపించింది. ఈ విద్యా సంవత్సరం గతేడాది ఫీజులనే కొనసాగించేలా అధికారులకు సర్కారు ఆదేశాలిచ్చినా, అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. టీఏఎఫ్-ఆర్సీనిర్ణయించిన ఫీజులనే మేనేజ్మెంట్లు వసూలు చేసుకునేలా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే, పెరిగిన ఫీజును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని.. తుది తీర్పునకు లోబడి ఆ మొత్తాన్ని వినియోగించాలని సూచించింది.  దీనిపై స్పందించిన సర్కారు.. ప్రస్తుతమున్న ఫీజులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని టీఏఎఫ్-ఆర్సీకి సూచించింది. 

దీంతో అడిట్ లెక్కలు సరిగా లేవని.. మరోసారి సమావేశానికి రావాలని మేనేజ్మెంట్లకు టీఏఎఫ్ఆర్సీ సమాచారమిచ్చింది. సోమవారం15 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్లతో చర్చలు జరపనున్నది. 40కి పైగా కాలేజీల్లో రూ.లక్షకు మించి ఫీజు ఉండడంతో వీటిని టీఏఎఫ్ఆర్సీ మరోసారి హియరింగ్-కు పిలుస్తోంది. టీఏఎఫ్-ఆర్సీ తాజా నిర్ణయం పట్ల స్టూడెంట్లు, పేరెంట్స్​హర్షం వ్యక్తం చేస్తున్నారు.