పెద్దపల్లి జిల్లాలో సాగుచేయని భూములకూ  రైతుబంధు .. దృష్టి పెట్టిన కొత్త సర్కార్​

పెద్దపల్లి జిల్లాలో సాగుచేయని భూములకూ  రైతుబంధు .. దృష్టి పెట్టిన కొత్త సర్కార్​
  • పెద్దపల్లి జిల్లాలో నాన్​అగ్రీల్యాండ్స్​ సుమారు 4 వేల ఎకరాలు 
  • వెంచర్లు, ఇటుక బట్టీలపై వివరాల సేకరణ
  • ఇన్నాళ్లూ నోరుమెదపని ప్రభుత్వ శాఖలు
  • తమ పరిధిలోనివి కావన్న రెవెన్యూ, మైనింగ్‌‌‌‌‌‌‌‌, వ్యవసాయ అధికారులు

పెద్దపల్లి, వెలుగు: బీఆర్ఎస్​ సర్కార్​ హయాంలో సాగుచేయని భూములు, ఇటుక బట్టీలు, వెంచర్లకు కూడా రూ.లక్షల్లో రైతుబంధు చెల్లించాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో 3వేల నుంచి 4 వేల ఎకరాల దాకా వ్యవసాయేతర భూములకు రైతు బంధు చెల్లించినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.

వ్యవసాయేతర కార్యకలాపాలకు వ్యవసాయ భూములను వినియోగిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్​ రైతుభరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇచ్చేందుకు రెడీ అయింది. ఈక్రమంలో ఇన్నాళ్లూ రైతుబంధు వస్తున్న వెంచర్లు, ఇటుకబట్టీలు, ఇతర వ్యవసాయేతర భూములను గుర్తించేందుకు ఆఫీసర్లకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా వెంచర్లు, ఇటుక బట్టీల నిర్వహణ భూములపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. 

పర్మిషన్లు, పర్యవేక్షణ ఉండవు

పట్టణాలు, గ్రామాలను ఆనుకొని ఉన్న వ్యవసాయ పొలాలు కూడా వెంచర్లుగా మారుతున్నాయి. వీటికి నాలా కన్వర్షన్లు లేకపోవడంతో ధరణి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో వ్యవసాయ భూములుగానే కొనసాగుతున్నాయి. దీంతో వీటికి కూడా రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. వ్యవసాయ భూమిలో ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా మైనింగ్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ శాఖల నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటుకబట్టీలు, వెంచర్లు ఏర్పాటు చేసినా ఇటు మైనింగ్​అధికారులు గానీ, అటు రెవెన్యూ అధికారులు గానీ చర్యలు తీసుకోవడం లేదు.

ఈ వ్యవహారంలో మైనింగ్​, రెవెన్యూ, వ్యవసాయ అధికారుల తీరుపై విమర్శలున్నాయి. వెంచర్లు వెలుస్తున్నా  వాటికి నాలా కన్వర్షన్​ లేకున్నా రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఏటా సాగు వివరాలను సేకరిస్తున్నారు. కానీ సాగులో లేని భూమికి రైతుబంధు డబ్బులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు నాలా కన్వర్షన్​ సర్టిఫికేట్​ లేకుండానే ఇటుక బట్టీల నిర్వహణకు మైనింగ్​ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు.

ఈ భూములన్నీ లీజుకు తీసుకున్నవి కావడంతో,  నాలా కన్వర్షన్​ కోసం చలాన్​ కట్టి వాటిని సంబంధిత అధికారులకు ఇస్తున్నారు. ఎవరైనా అడిగితే నాలా కన్వర్షన్​ కోసం అప్లై చేసుకున్నామని చెబుతున్నారు. సర్టిఫికేట్​ వస్తే రైతుబంధు లిస్ట్​ నుంచి తొలగించేలా చూస్తామని అధికారులు అంటున్నారు. ఈ వ్యవహారంలో నాటి అధికార పార్టీ లీడర్ల ప్రమేయం ఉండడంతో ఏ అధికారీ చర్య తీసుకునేందుకు సాహసించలేదన్న ఆరోపణలున్నాయి.  ఈ వ్యవహారాలన్నింటిపై ప్రస్తుత కాంగ్రెస్​సర్కార్​ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

ఇటుక బట్టీలతో డబుల్​ ఇన్​కం...

రైతుబంధు పేరిట ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున వస్తుండడంతో పెట్టుబడికి రైతులకు కాస్త ఆసరా లభించింది. కానీ రైతుబంధు స్కీములో లోపాలను వినియోగించుకొని కొన్ని ప్రాంతాల్లో సాగుచేయని వారు భూములకూ రైతుబంధు పొందుతున్నారు. కొందరు బడా రైతులు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తమ భూములను ఇటుక బట్టీల నిర్వహణకు లీజుకు ఇచ్చారు. ఇందుకు ఎకరానికి రూ. 30 నుంచి రూ.40 వేలు తీసుకుంటున్నారు. ఇలా పంట పండించకపోయినా రైతుబంధు, లీజు పైసలతో యజమానులు డబుల్ బెనిఫిట్​పొందుతున్నారు.